
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ, కూటమి నాయకుల మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. వైసీపి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి లక్ష్యంగా తెలుగుదేశం కూటమి నాయకుడు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇటీవల జరిగిన మత్స్యకార సొసైటీ ఎన్నికల వివాదం, కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో అనపర్తి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి.. సత్తి సూర్యనారాయణ రెడ్డిపై విమర్శల జడివాన కురిపించారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ..
వైసీపి నేతలు జక్కంపూడి రాజా, జగ్గిరెడ్డి వంటి వారు అక్కడ గొడవ పడుతుంటే, సూర్యనారాయణ రెడ్డి మాత్రం ఏం చేయాలో తెలియక బిత్తరచూపులు చూస్తూ నిలబడ్డారని నల్లమిల్లి విమర్శించారు. వైసీపి నేతలు కొందరు హీరోలు అవ్వాలని చూసి, చివరికి సూర్యనారాయణ రెడ్డిని జీరోను చేశారని చురకలు అంటించారు.
ఈ వివాదానికి కారణమైన మత్స్యకార సొసైటీ ఎన్నికల గురించి నల్లమిల్లి క్లియర్ కట్ వివరణ ఇచ్చారు. మార్చి 5న తాము శాసనసభ సమావేశాల్లో ఉండగా ఈ గొడవ జరిగిందని, తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. వైసీపి నాయకులే ఓటర్లను కిడ్నాప్ చేసి, ఆ కేసును డైవర్ట్ చేయడానికి పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
చివరికి ఈ కిడ్నాప్ కేసును కోర్టు పరిశీలించి నిందితులకు రిమాండ్ విధించిందని, దాంతో వైసీపి నేతల నోర్లు మూతపడ్డాయని నల్లమిల్లి గుర్తు చేశారు. సూర్యనారాయణ రెడ్డి బయటకు సౌమ్యుడిగా కనిపిస్తారనే వాదనను ఆయన కొట్టిపారేశారు. మైక్ లేకపోతే ఆయన మాట్లాడే భాష దారుణంగా ఉంటుందని, పచ్చి బూతులు మాట్లాడతారని నల్లమిల్లి అన్నారు
.
వైసీపి ప్రభుత్వ హయాంలో తనపై 39 తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని, కూటమి కార్యకర్తలపై 151 కేసులు పెట్టి వేధించారని నల్లమిల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యనారాయణ రెడ్డి హయాంలో జరిగిన భూసేకరణ అవినీతిపై ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందని, దాదాపు 15 కోట్ల రూపాయల అక్రమాలు ప్రూవ్ అయ్యాయని వెల్లడించారు.
త్వరలోనే ఈ భూసేకరణ అక్రమాలకు సంబంధించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఐఏఎస్ అధికారులతో పాటు రాజకీయ నాయకుల పేర్లు కూడా విజిలెన్స్ నివేదికలో ఉన్నాయని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే గత ప్రభుత్వం వేసిన మూడు విజిలెన్స్ ఎంక్వైరీల్లోనూ క్లీన్ చిట్తో బయటపడ్డామని నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి చెప్పారు.
తాడేపల్లి ప్యాలెస్ దాటి రా.. చర్చకు సిద్ధం.. జగన్ కు లోకేష్ సవాల్!
ఋషికొండ ప్యాలెస్ నిర్వహణ.. నెలకు రూ. 25 లక్షలు ప్రజాధనం వృధా
.