తెలంగాణ రైతులకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి గుడ్‌న్యూస్ చెప్పాయి. పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయం త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.2 వేలు జమ చేయనుండగా..
రైతు భరోసా పథకం కింద తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.6 వేలను రైతుల ఖాతాల్లో వేయనుంది. అయితే పీఎం కిసాన్ నిధులను ఈనెల 20వ తేదీన విడుదల చేయనుండగా.. రైతు భరోసా నిధులను ఈనెల 30వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే మొదట రైతు భరోసా నిధులను ఈనెల 26వ తేదీ నుంచి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది.
కానీ తాజాగా జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను.. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇలాఖా అయిన మధిరలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి..
రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ అనధికార సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే భేటీలో హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించారు.
ఇక జూన్ 30వ తేదీన ప్రారంభించి.. వరుసగా 9 రోజుల పాటు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఈ రైతు భరోసా పథకం కింద.. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది.
సంవత్సరానికి ఒక ఎకరానికి రూ.12 వేల చొప్పున.. వానాకాలం, యాసంగి సీజన్‌కు రూ.6 వేల చొప్పున నిధులను రైతుల
ఖాతాల్లో వేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది అన్నదాతలు ఉండగా.. దశల వారీగా వారికి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు.మరోవైపు.. అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయం కింద నిధులను రైతుల అకౌంట్లలో వేయనుంది. ఈనెల 20వ తేదీన ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం 23వ విడత కింద డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. ఒక్కో రైతు అకౌంట్లో రూ. 2 వేల చొప్పున ఏడాదికి 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం మొత్తంగా రూ.6 వేలను అందిస్తోంది.