Gold Import Duty Hike : భారతదేశంలో బంగారం అంటే ఎంత ఆసక్తి ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా మహిళలు గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసి ధరించాలని చూస్తుంటారు. పండగైనా, పబ్బమైనా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతలా బంగారం అనేది మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది.
కానీ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గతేడాది నుంచి పసిడితో పాటుగా వెండి ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. గత సంవత్సరమే ఏకంగా 70 శాతం పెరగడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో పెరిగినా.. మళ్లీ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరిగి పసిడి ధరలు దిగొచ్చాయి.
అయితే ఇక్కడే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలతో పసిడికి డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు నెలకు సగటున పసిడి దిగుమతులు కేవలం 25-30 టన్నులుగా మాత్రమే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఇది ఏకంగా 75-100 మెట్రిక్ టన్నుల వరకు ఉండేది.
ఇక్కడ ప్రధానంగా పసిడి దిగుమతులపై సుంకాలు పెరగడమే కారణమని తెలుస్తోంది. అంటే ఇక్కడ సుంకాల పెంపు అనేది ప్రభుత్వ విధానపర నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్లు తెలిసింది. ఇక్కడ పసిడి దిగుమతులు తగ్గేందుకు చాలానే కారణాలు ఉండొచ్చు.
బంగారం ధరలు అధికంగా ఉండటం లేదా పసిడి డిమాండ్ తగ్గడం లేదా రీసైక్లింగ్ గోల్డ్ అంటే పాత ఆభరణాల్ని విక్రయించి కొత్తవి కొనుగోలు చేయడం పెరగడం వంటివి బంగారం డిమాండ్ తగ్గేందుకు కారణాలుగా చెబుతున్నారు. అయితే ఇక్కడ గోల్డ్ డిమాండ్ తగ్గించడంలో కేంద్రం పాత్ర కీలకంగా ఉంది.
మోదీ పిలుపు.. పెరిగిన సుంకాలు..భారత్ ఎక్కువగా బంగారాన్ని దిగుమతుల రూపంలోనే తెచ్చుకోవాలి కాబట్టి దిగుమతి బిల్లు పెరిగిపోతోంది. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఈ క్రమంలోనే విదేశీ మారకం ఆదా చేసేందుకు బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ
స్వయంగా పిలుపునిచ్చారు. అంతటితో ఆగలేదు తర్వాత పసిడి దిగుమతులపై పరిమితుల్ని విధించారు. ఇంకా పసిడి, వెండిపై గతంలో ఉన్న 6 శాతం దిగుమతి సుంకాల్ని మే 13న కేంద్రం.. ఏకంగా 15 శాతానికి పెంచడం పెద్ద దెబ్బకొట్టింది. ఇదే పసిడి దిగుమతులు తగ్గేలా చేశాయని చెబుతున్నారు.మే నెలలో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు..విలువ పరంగా చూస్తే మే నెలలో పసిడి దిగుమతులు 3.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇక్కడ దాదాపు దిగుమతుల విలువ 40 శాతం వరకు తగ్గింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో చూస్తే మాత్రం స్వల్పంగా పెరిగింది. అయినా ఇప్పుడు మాత్రం వరుసగా దిగుమతులు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ రూపంలో ఇచ్చి కొత్త బంగారం కొనుగోలు చేస్తుండటం వల్ల కూడా డిమాండ్ ఆశించినంత లేదని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.