
డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కీలక అడుగు వేసింది. ‘ఇగ్నిటస్ ఎడ్యుటెక్’తో ఓపెన్ వర్సిటీ ఒప్పందం హైదరాబాద్ సిటీ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కీలక అడుగు వేసింది.
మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా.. ప్రముఖ విద్యాసంస్థ ‘ఇగ్నిటస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ (ముంబై)తో వర్సిటీ అవగాహన ఒప్పంద కుదుర్చుకుంది. అంబేడ్కర్ వర్సిటీ క్యాంప్‌సలో వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి సమక్షంలో..
రిజిస్ట్రార్ డా.ఎల్.విజయ కృష్ణారెడ్డి, ఇగ్నిటస్ ఎడ్యుటెక్ డైరెక్టర్ మీటాసింగ్ కన్వర్ బుధవారం ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. నేటి ఉపాధి రంగంలో విదేశీ భాషల ప్రాధాన్యం ఎంతో పెరిగిందని వివరించారు.
ఇందులో భాగంగానే మొదటి విడత కింద ఇంగ్లిష్, కొరియా, జపనీస్, జర్మన్ భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు, స్కిల్ కోర్సులతో పాటు విదేశీ భాషల కోసం యూనివర్సిటీలోనే ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వీసీ వెల్లడించారు
.