
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ (ఫుడ్ కమిషన్) ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డి భద్రత వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు 1+1 భద్రతను పునరుద్ధరించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది.
ఈ విషయంలో ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చుతూ, ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.వివరాల్లోకి వెళితే, ఫుడ్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న విజయప్రతాప్ రెడ్డికి కల్పించిన భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఆయనకు 1+1 భద్రతను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది.
మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ఈ అంశంలో లోతైన పరిశీలన అవసరమని అభిప్రాయపడింది. అందువల్ల, సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు లేదా వాటిని సవరించేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.డివిజన్ బెంచ్ నిర్ణయంతో ఫుడ్ కమిషన్ ఛైర్మన్‌కు ప్రస్తుతం 1+1 భద్రత కొనసాగనుంది.
అనంతరం ఈ కేసు విచారణను ధర్మాసనం మూడు నెలలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి వాదనలు విననున్నట్లు కోర్టు వెల్లడించింది
.