నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయంగా ఉపయోగపడేందుకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన కింద ఏటా మూడు విడతల్లో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం రూ.20 వేలు జమచేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పీఎం కిసాన్ యోజన కింద రూ.6000, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14000 సాయంగా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ నెలాఖరులోగా అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇక ఈ పథకం లబ్ధిని అర్హులైన రైతులు నష్టపోకుండా చూసే చర్యలలో భాగంగా తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏవైనా తప్పుల కారణంగా పథకం ప్రయోజనాలు పొందలేని రైతులు తమ తప్పులను సరిచేసుకోవడానికి ప్రస్తుతం అవకాశం కల్పించారు. అలాగే ఇప్పటి వరకూ ఈ పథకం లబ్ది అందని రైతులు.. తమ సమీప రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. రైతు సేవా కేంద్రాలలో తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయాలను సరిచూసుకోండి..అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పొందాలంటే రైతులు తమ భూముల వివరాలకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలి. అలాగే ఆధార్ ఇన్ యాక్టివ్ అని వస్తే దాన్ని సరిచేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన డబ్బులు పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, భూమి రికార్డులలో ఎలాంటి తప్పులు లేకుండా ముందే సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను చెల్లించేవారికి, అధికంగా కరెంట్ ఉపయోగించేవారికి, ఇళ్ల స్థలాలు, కార్లు వంటి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారిని ఈ పథకం నుంచి మినహాయించారు. వారి పరిస్థితులలో ఏమైనా మార్పులు ఉంటే.. దానికి సంబంధించిన పత్రాలతో సచివాలయాలు, వ్యవసాయ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రాలలో సంప్రదించి వివరాలు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.