
వయసు పెరిగేకొద్దీ జుట్టు పలుచబడటం చాలామందిలో కనిపించే సహజమైన మార్పు. ఇది బయటకి కనిపించే సమస్య మాత్రమే కాదు, శరీరంలో జరిగే అంతర్గత మార్పుల ప్రతిబింబం కూడా. నిపుణుల ప్రకారం జుట్టు పలుచబడటానికి ప్రధాన కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నిపుణుల ప్రకారం, జుట్టు ఆరోగ్యం పూర్తిగా శరీర ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో ఐరన్, ప్రోటీన్, విటమిన్ D, బయోటిన్ వంటి పోషకాలు తగ్గినప్పుడు జుట్టు రాలడం ఎక్కువవుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో లేదా రక్తహీనత ఉన్నవారిలో హెయిర్ థిన్నింగ్ సాధారణంగా కనిపిస్తుంది.
కాబట్టి పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, పండ్లు వంటి వాటిని చేర్చడం వల్ల జుట్టు మూలాలకు బలం అందుతుంది. అలాగే వయసుతో పాటు హార్మోన్ల మార్పులు కూడా జుట్టు పలుచబడటానికి కారణం అవుతాయి.
ముఖ్యంగా డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల హెయిర్ ఫాలికల్స్ కుంచించుకుపోయి జుట్టు సన్నగా మారుతుంది. ఇది పురుషులలో ఎక్కువగా కనిపించినా, మహిళల్లో కూడా మెనోపాజ్ తర్వాత ఈ సమస్య కనిపించవచ్చు. అయితే సరైన ట్రీట్మెంట్, కేర్‌తో ఈ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
రోజువారీ జుట్టు సంరక్షణలో చేసే చిన్న తప్పులు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. బాగా వేడి నీటితో తలస్నానం చేయడం, తరచుగా హీట్ స్టైలింగ్ టూల్స్ వాడటం, కెమికల్ కలిగిన షాంపూలు ఉపయోగించడం వంటివి జుట్టును మరింత బలహీనపరుస్తాయి. నిపుణుల ప్రకారం కెమికల్ ఫ్రీ షాంపూలు వాడటం, వారానికి 2–3 సార్లు తలస్నానం చేయడం, తల చర్మాన్ని మృదువుగా మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
టెన్షన్ వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరిగి హెయిర్ గ్రోత్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. యోగా, ధ్యానం, సరైన నిద్ర వంటి అలవాట్లు ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం 7–8 గంటల నిద్ర కూడా జుట్టు
ఆరోగ్యానికి అవసరం.
జుట్టు ఎప్పుడూ ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం బయటి ట్రీట్మెంట్స్పై ఆధారపడకూడదు. నూనె మసాజ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆముదం నూనెతో వారానికి రెండు సార్లు మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్ బలపడతాయి. అయితే అధికంగా ఆయిల్ అప్లై చేసి ఎక్కువసేపు ఉంచడం కాకుండా, సరైన విధంగా శుభ్రపరచడం కూడా అవసరం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వయసు పెరిగినా జుట్టు బలంగా, అందంగా ఉంటుంది.