
Rating: 2.75 ---సూర్య ప్రకాష్ జోశ్యుల కేరళలోని కుజినీలం పోలీస్ స్టేషన్. అక్కడ ఎప్పుడూ పెద్దగా కేసులుండవు. చిన్న చిన్న గొడవలు, గ్రామ సమస్యలు తప్ప హత్యలు, దోపిడీలు అక్కడి పోలీసులకు కొత్తే. అలాంటి ప్రశాంతమైన స్టేషన్‌కు కొత్త ఎస్సైగా అడుగుపెడతాడు విజయ్ (షేన్ నిగమ్) .
తొలి పోస్టింగ్ కావడంతో కాస్త టెన్షన్ ఉన్నా, క్రైమ్ లేని ప్రాంతం కావడంతో కూల్ గా ఉంటాడు. కానీ ఆ ప్రశాంతత ఎక్కువ రోజులు నిలవదు. విజయ్ బాధ్యతలు చేపట్టిన రెండో రోజుకే ఊరి శివారులో గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువకుడి శవం బయటపడుతుంది.
పోలీసులు ఆ కేసు గురించి ఆలోచిస్తుండగానే మరో షాక్ ఎదురవుతుంది. స్థానిక ఫైనాన్స్ కంపెనీలో భారీ దోపిడీ జరుగుతుంది. 120 సవర్ల బంగారం, రూ.50 లక్షల నగదు క్షణాల్లో మాయమవుతాయి. ఈ రెండు ఘటనలతో ఊరు ఉలిక్కిపడుతుండగానే డ్యామ్ సమీపంలో మరో శవం బయటపడుతుంది.
ఒకప్పుడు ప్రశాంతంగా కనిపించిన గ్రామం ఇప్పుడు భయంతో వణికిపోతుంది. అసలు ఈ హత్యల వెనుక ఎవరున్నారు? దోపిడీకి, హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? లేక ఎవరైనా పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారా? అనుభవం లేకపోయినా బాధ్యత ఎక్కువగా ఫీలయ్యే విజయ్, తన టీమ్ తో కలిసి దర్యాప్తు మొదలుపెడతాడు.
కానీ ప్రతి క్లూ అతడిని మిస్టరీ విప్పాల్సింది పోయి మరింత గందరగోళంలోకి నెడుతుంది. ఒక కేసును ఛేదించబోతే మరో ప్రశ్న ఎదురవుతుంది. సమయం గడుస్తోంది... పై అధికారుల ఒత్తిడి పెరుగుతోంది... నేరస్తుడు మాత్రం పోలీసుల కంటే ఒక్క అడుగు ముందే ఉన్నట్టుంటాడు.
చివరికి విజయ్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు? వరుస హత్యల వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఫైనాన్స్ కంపెనీ దోపిడీకి కారణం ఎవరు? అనేదే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లోని అసలు ట్విస్ట్. ఎనాలసిస్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనే జానర్ సినిమాలో ప్రేక్షకుడు కోరుకునేది ఒక్కటే — "తర్వాత ఏమవుతుంది?" అనేది
. కథ ఎంత మామూలుదైనా, ఐడియా ఎలాంటిదైనా, ఆ ప్రశ్నను రెండు గంటలు సేపు సజీవంగా ఉంచగలిగితే సినిమా విజయవంతమవుతుంది. అయితే ఈ 'దృఢం' సినిమా చివరి 20-30 నిమిషాల్లో ఆ లక్ష్యాన్ని అద్భుతంగా సాధిస్తుంది. కానీ అప్పటిదాకా? స్క్రీన్‌ప్లే పరంగా చూస్తే, ఈ సినిమా "Payoff Driven Thriller". అంటే మొత్తం కథని ఒక భారీ క్లైమాక్స్ ట్విస్ట్ కోసం డిజైన్ చేసారు. సమస్య ఏమిటంటే, ఆ ట్విస్ట్‌ను చేరుకోవడానికి ముందు వచ్చే ప్రయాణం మాత్రం ఆ ట్విస్ట్ స్దాయిలో ఉండదు. జస్ట్ ఓకే అన్నట్లు ఉంటుంది. సినిమా ప్రారంభంలో దర్శకుడు కుజినీలం అనే ప్రశాంతమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. కొత్త ఎస్సై విజయ్, స్నేహపూర్వకమైన పోలీస్ స్టేషన్, క్రైమ్ లేని వాతావరణం. ఇది మంచి సెటప్. ఎందుకంటే థ్రిల్లర్‌లో ప్రశాంతత ఎంత బలంగా స్థాపిస్తే, దాన్ని ఛేదించే సంఘటన అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రశాంతంగా ఉన్న నీళ్లలో రాయి వేస్తే అలలు వచ్చినట్లుగా ... ఆ ఊరి ప్రశాంతతను భగ్నం చేస్తూ ... మొదటి శవం, తర్వాత ఫైనాన్స్ కంపెనీ దోపిడీ, ఆపై మరో శవం... సెటప్ బాగా కుదిరింది. అయితే సెటప్ నుంచి క్లైమాక్స్ కు వెళ్లే దారే నత్త నడక. కొన్ని చోట్ల కంకరరాళ్ల గుట్టలు. ఏదో ఉందనే భ్రమ..ఆ తర్వాత ఏమీ లేదనే నిశ్శబ్దం. దానికి తోడు స్క్రీన్‌ప్లే "ఇన్ఫర్మేషన్ డెలివరీ" అన్నట్లుగా వచ్చే సీన్స్ తో నడుస్తుంది. అంటే చాలా సీన్స్ ప్రేక్షకుడికి సమాచారం చెప్పడానికే ఉన్నట్టు అనిపిస్తాయి. పాత్రలు మాట్లాడుతున్నట్లు కాకుండా, రచయిత డైరక్ట్ గా సీన్ లోకి వచ్చి ప్రేక్షకుడికి వివరాలు చెబుతున్నట్లు అనిపించే సందర్భాలు ఎక్కువ. థ్రిల్లర్లలో సమాచారం ఎంత ముఖ్యమో, ఆ సమాచారాన్ని ఎలా దాచిపెట్టి అందిస్తామన్నది అంతకంటే ముఖ్యం అనేది మర్చిపోయారు. 'దృఢం'లో కథను ఇంట్రస్టింగ్ గా మార్చే క్లూలు ఉన్నాయి. మిస్ గైడ్ చేసే డైరెక్షన్ కూడా ఉంది. కానీ వాటి ప్రెజెంటేషన్ చాలా స్పష్టంగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుడు రచయిత ఉద్దేశాన్ని కనిపెట్టేస్తాడు. మంచి థ్రిల్లర్‌లో క్లూ కనిపించాలి, కానీ క్లూ అని కనిపించకూడదు. అలాగని సినిమా విసిగిస్తుందని కాదు..ముందుకు వెళ్ళదే అనిపిస్తుంది. ఈ సినిమాలో అత్యంత బలమైన అంశం క్లైమాక్స్. ప్రీ-క్లైమాక్స్ నుంచి కథ ఒక్కసారిగా గేర్ మార్చుకుంటుంది. అప్పటివరకు సాధారణ పోలీస్ ప్రొసీజరల్లా కనిపించిన కథ, అనూహ్యమైన దిశలో వెళ్లడం మొదలుపెడుతుంది. ఒక ట్విస్ట్ తర్వాత మరో ట్విస్ట్ రావడం కాదు ఇక్కడ ప్రత్యేకత. ప్రతి ట్విస్ట్ ముందు జరిగిన సంఘటనలకు కొత్త అర్థాన్ని ఇవ్వడం అసలు బలం. అల్ఫ్రెడ్ హిచ్‌కాక్ చెప్పిన ప్రసిద్ధ మాట ఉంది: "There is no terror in the bang, only in the anticipation of it." 'దృఢం' ఫస్టాప్ లో ఆ anticipation ను పూర్తిగా ఇవ్వలేకపోయింది. కానీ చివరి భాగంలో మాత్రం దాన్ని బలంగా రికవర్ చేస్తుంది. మొత్తంగా చూస్తే, 'దృఢం' బలహీనమైన బిల్డ్-అప్ తో తడబడుతూ అద్భుతమైన పే-ఆఫ్ తో నిలబడుతుంది. ఫైనల్ థాట్ 'దృఢం' ఒక పరుగు పందెంలా కాదు... చివరి ల్యాప్‌లో వేగం పెంచే మరాథాన్‌లా ఉంటుంది. మొదటి గంటన్నర ఓపికగా నడిస్తే, చివరి అరగంట మాత్రం మీలోని థ్రిల్లర్ అభిమానిని మేల్కొలుపుతుంది. క్రైమ్ థ్రిల్లర్ గురించి సినిమావాళ్లు ఎప్పుడూ చెప్పే ఓ మాట గుర్తు చేసుకోవాలి.... "క్లైమాక్స్ దాకా హంతకుడిని దాచడం కంటే, అప్పటిదాకా ప్రేక్షకుడి ఆసక్తిని కోల్పోకుండా ఉంచడం కష్టం." ఎక్కడ చూడచ్చు జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.