
గద్వాల : కర్నాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇంజినీర్ల బృందం పరిశీలించింది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి కర్నాటక, తెలంగాణ రాష్టాలకు విడుదల అవుతున్న నీటి విడుదల, ఆర్డీఎస్ ఆనకట్ట దగ్గర ఉన్న పెండింగ్ పనులు, ప్రధాన కాల్వ మరమ్మతు, కర్నాటక, ఏపీ రాష్ట్రాలు అక్రమంగా చేస్తున్న నీటి చౌర్యం, ఆనకట్ట ను బ్యారేజీగా మార్పు చేయుటకు తీసుకోవాల్సిన చర్యలు, తుంగభద్ర బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు అనుసరించాల్సిన అంశాలపై మూడు రాష్ట్రాల అధికారులతో సమీక్ష చేశారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు గత 75 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయంపై ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ తనగల సీతారాం రెడ్డి కేఆర్ఎంబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఎస్ ఆనకట్ట మరమ్మతులు చేయాలని తెలంగాణ సర్కారు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పెడచెవిన పెడుతుండటంతో ఆర్డీఎస్ అందాల్సిన 15.9 టీఎంసీల నీరు అందటం లేదని వివరించారు.
ఆనకట్టలో షీల్ట్ పేరుకుపోవడం, వరదలకు ఆనకట్ట దెబ్బతినడం, కాల్వ లైనింగ్ లేకపోవడంతో 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా అందుకు తగ్గట్లు రావడం లేదని వివరించారు. ఏపీ సర్కార్ కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా 4 టీఎంసీల నీటిని తరలించేందుకు ఎడమ కాల్వ నిర్మాణం చేపట్టడంతో అడ్డుకున్నామని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం మూడు రాష్టాల అధికారులతో ఆర్డీఎస్ పై సమీక్ష చేశారు
.