
ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం ప్రపంచంలోని పలు దేశాలతో పాటు అమెరికా పైనా గట్టిగానే పడింది (USA-Iran). ఈ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సరఫరాలో అంతరాయాల వల్ల అగ్రరాజ్యం తన అత్యవసర నిల్వలను విడుదల చేయాల్సివచ్చింది (Strategic Petroleum Reserve).
దాంతో వ్యూహాత్మక నిల్వలు 40 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. జూన్ 12 నాటికి 340.3 మిలియన్ బార్యెళ్లకు చేరుకున్నాయి. ఈమేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ గణాంకాలను విడుదల చేసింది. ఘర్షణల వల్ల నిల్వలు వేగంగా తరిగిపోతూ.. సంక్లిష్ట స్థాయికి పడిపోతున్నాయని ఇంధన సంస్థల ఉన్నతస్థాయి సిబ్బంది ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘మునుపెన్నడూ లేని స్థాయికి తరిగిపోతున్నాయి. వేసవిలో ఇంధన డిమాండ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న తరుణంలో నిల్వలు తగ్గి, ధరలు పెరిగే సమయం ఇది’’ అని ఎక్సాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నీల్ చాప్మన్ ఇటీవల హెచ్చరించారు. కాగా, మార్చి నెలలో తన వ్యూహాత్మక నిల్వల నుంచి 172 మిలియన్ బ్యారెళ్లను విడుదల చేయడానికి అమెరికా (USA) అంగీకరించింది.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) సభ్యదేశాల సమన్వయంతో విడుదలైన 400 మిలియన్ బ్యారెళ్లలో ఆ మొత్తం కూడా భాగమే. ‘‘అందరికీ అమెరికా చివరి ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఇతరచోట్ల లభ్యత లేనందున, ప్రతిఒక్కరూ బ్యారెళ్లను తరలించుకోవడానికి అమెరికాకు వస్తున్నారు’’ అని కెప్లర్లోని కమోడిటీ రిసెర్చ్ డైరెక్టర్ మాట్ స్మిత్ అభిప్రాయపడ్డారు.
ఈనేపథ్యంలో ప్రస్తుత నిల్వల కొరతకు జోబైడెన్ హయాంలో తీసుకొన్న నిర్ణయాలే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. దేశ నాయకత్వం యుద్ధాన్ని నడిపించిన విధానంపై చాలామంది అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు.
మరోవైపు నిల్వలు తరుగుతూ, ఇంధన ధరల పెరుగుదలతో అమెరికాలో సగటున ఒక్కో కుటుంబంపై 450 డాలర్ల అదనపు భారం పడుతోన్న సమయంలో ఇరాన్‌తో అమెరికా ఒప్పందం గురించి ప్రకటన వచ్చింది. ‘ప్రపంచంలోని నౌకలు.. మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు
రవాణా చేయండి’ అంటూ ఒప్పందం గురించి ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌పై జూన్ 19న సంతకాలు జరగనున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.