సనాతన ధర్మంలో వంటగదికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది వంట చేసే చోటు మాత్రమే కాదు.. ఇక్కడే అన్నపూర్ణా దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అందుకే వంటగదిలో కొన్ని పదార్థాలు ఎప్పుడూ పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అవి నిండుగా ఉండటం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖశాంతులు, ఆర్థిక స్థిరత్వం ఉంటాయని నమ్మకం. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందామా.. హిందూ సంప్రదాయం ప్రకారం పసుపు చాలా పవిత్రమైంది. దీన్ని బృహస్పతి (గురు గ్రహం)కి ప్రతీకగా భావిస్తారు.
గురుడు జ్ఞానం, గౌరవం, శుభ ఫలితాలు, అభివృద్ధికి కారకుడు. అందుకే ఇంట్లో పసుపు డబ్బా ఖాళీ అవ్వడం అశుభం. పసుపు కొద్దిగా ఉన్నప్పుడే కొత్తది తెచ్చి నింపుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రంలో ఉప్పుకు కూడా ప్రత్యేక స్థానం ఉంది.
ఇది రాహు, కేతు గ్రహాల ప్రభావంతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. ఉప్పు డబ్బా పూర్తిగా ఖాళీ అయితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మానసిక ఆందోళనలు పెరుగుతాయట. అందుకే ఉప్పు డబ్బాలో ఎప్పుడూ కొంచెమైనా ఉప్పు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బియ్యాన్ని "అక్షత" అని కూడా అంటారు. అక్షత అంటే నాశనం లేనిది, శుభానికి సంకేతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బియ్యానికి చంద్ర, శుక్ర గ్రహాలతో సంబంధం ఉంది. ఇంట్లో బియ్యం పూర్తిగా అయిపోతే ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌభాగ్యం దెబ్బతింటాయని నమ్మకం.
అందుకే బియ్యం డబ్బాను ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం వంటగదిలో పిండి డబ్బా పూర్తిగా ఖాళీ అవ్వడాన్ని కూడా అశుభంగా భావిస్తారు. ఇది సంపద, గౌరవం, కుటుంబ అభివృద్ధిపై చెడు ప్రభావం చూపుతుందని నమ్మకం.
అందుకే పిండి పూర్తిగా అయిపోయే వరకు ఆగకుండా, కొద్దిగా మిగిలి ఉన్నప్పుడే కొత్త పిండిని నింపుకోవడం మంచిది. ఆవాల నూనెకు శని గ్రహంతో సంబంధం ఉందని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. చాలా
మంది నూనె పూర్తిగా అయిపోయాకే కొత్తది కొంటారు. కానీ వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. నూనె డబ్బా పూర్తిగా ఖాళీ అయితే పనుల్లో ఆటంకాలు, అనవసర ఖర్చులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయట. అందుకే నూనె కొద్దిగా ఉన్నప్పుడే కొత్తది తెచ్చి పెట్టుకోవడం ఉత్తమం.