
MATA : ప్రవాస తెలుగు సమాజాన్ని ఒకే తాటిపైకి తెస్తూ ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రెండో కన్వెన్షన్ వేడుకలు – 2026కు సర్వం సిద్ధమైంది. గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో జూన్ 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ మహాసభల ఏర్పాట్లపై మాటా ముఖ్య నాయకులు ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు.
మునుపెన్నడూ లేని విధంగా ప్రవాస తెలుగువారంతా గర్వపడేలా ఈ వేడుకలను సక్సెస్ చేయడానికి సుమారు 30కి పైగా కమిటీలు సమన్వయంతో రేయింబవళ్లు శ్రమిస్తున్నాయని మాటా ఫౌండర్ శ్రీనివాస్ గనగోని వెల్లడించారు. ఈ మహాసభలకు అమెరికా నలుమూలల నుండి దాదాపు 7 వేల నుంచి 10 వేల మంది వరకు తెలుగువారు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు మాటా ఫౌండర్ , ఏసీ మెంబర్ ప్రదీప్ శ్యామలా వివరించారు.
ఈ వేడుకల్లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP), స్టార్ సింగర్ రామ్ మిరియాల నేతృత్వంలో జరిగే ప్రత్యేక మ్యూజికల్ నైట్ షోలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఆధ్యాత్మిక వైభవం… ఈ కన్వెన్షన్ లో వినోదంతో పాటు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్నట్లు మాటా ప్రెసిడెంట్ రమన కిరణ్ దుడ్డాగి తెలిపారు.
ఇందులో భాగంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే సీతారాముల కళ్యాణంతో పాటు, అమెరికా చరిత్రలోనే తొలిసారిగా అత్యంత వైభవంగా ‘శ్రీరామ పట్టాభిషేక’ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన నొక్కి చెప్పారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రవాసులు భారీగా తరలిరావాలని కోరారు.
ప్రవాసులకు తమ సొంత గడ్డను గుర్తుకు తెచ్చేలా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన నోరూరించే విభిన్న సంప్రదాయ ప్రత్యేక రుచులతో విందు భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫుడ్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కన్వెన్షన్ లో పాల్గొనాలనుకునే టికెట్ల కోసం వెంటనే convention.mataus.org అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని, స్పాన్సర్షిప్ అవకాశాలు
కూడా అందుబాటులో ఉన్నాయని మాటా నాయకత్వం తెలిపింది.