
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కాలిఫోర్నియాలో ఓ విమానం కూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ప్రమాదానికి గురైన విమానాన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-52 బాంబర్ విమానంగా గుర్తించారు. ఈ ఘటనలో ఎనిమిది మంది అమెరికా వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అమెరికా వాయుసేన అమ్ములపొదిలో చాలా పాత బాంబర్ విమానాల్లో బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్ (B-52H Stratofortress) ముఖ్యమైంది.
ఇది 1955లో ఆ దేశ వాయుసేన చేతికి వచ్చింది. మొత్తం 744 విమానాలను తయారుచేయగా.. చివరి బి-52హెచ్ వేరియంట్‌ను 1962లో తయారుచేశారంటే అవెంత పాతవో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్కటే 20 క్రూజ్ క్షిపణులను ప్రయోగించగలదు. దీనిని అవసరాలకు అనుగుణంగా అమెరికా యుద్ధాల్లో వాడుకొంటోంది.
కోల్డ్‌వార్ వేళ అణ్వాయుధాలను ప్రయోగించగల బాంబర్‌గా ఇది భయపెట్టగా.. వియత్నాం యుద్ధంలో చిన్నస్థాయి బాంబర్లాగా సేవలు అందించింది. ఇరాన్‌పై దాడుల్లో కూడా ఈ విమానాలను వాడుకొంది. స్ట్రాటోఫోర్ట్రెస్లు చూడటానికి ఆకారంలో చాలా భారీగా ఉంటాయి.
యుద్ధ రంగంలో వ్యూహాత్మక దాడులు, క్లోజ్ ఎయిర్ సపోర్ట్, కౌంటర్ ఎయిర్, మారిటైమ్ ఆపరేషన్లకు వీటిని వాడతారు. 1990ల్లో ఇరాక్‌పై చేపట్టిన ఆపరేషన్‌లో 40% బాంబులను ఈ విమానాలే ప్రయోగించాయంటే.. అమెరికా వీటిపై ఏ స్థాయిలో ఆధారపడుతోందో అర్థం చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు