
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల నీట్ పరీక్ష పత్రం లీక్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా ఈ నెల 21న రీ-ఎగ్జామ్ నిర్వహించడానికి ఎన్టీఏ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నీట్ పోర్టల్‌లో మరో వైఫల్యం (Refund Scam) వెలుగులోకి వచ్చింది. నీట్ అభ్యర్థుల (NEET aspirants) పాస్వర్డ్లు, పిన్‌లను దొంగలించి..
బ్యాంకు ఖాతాల నుంచి రీఫండ్‌ను కాజేస్తున్న నిందితుడిని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బిహార్‌కు చెందిన 19 ఏళ్ల నవీన్ యాదవ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీట్ పోర్టల్‌లోని భద్రతా లోపాలు, బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించుకొని బిహార్‌లోని గయాకు చెందిన నవీన్ యాదవ్ నీట్-యూజీ అభ్యర్థుల ఖాతాలలోకి అనధికారికంగా ప్రవేశించాడు.
350 మందికి పైగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు సుమారు 150 ఖాతాలను విజయవంతంగా యాక్సెస్ చేశాడు. వీటిని యాక్సెస్ చేయడానికి పాస్వర్డ్లు, ఎన్క్రిప్షన్ కీలు, పిన్‌లను ఛేదించడానికి ఉపయోగించే ట్రయల్-అండ్-ఎర్రర్ పద్ధతి అయిన బ్రూట్-ఫోర్స్‌ను ఉపయోగించి ఖాతాలలోకి చొరబడ్డాడు.
అనంతరం విద్యార్థుల ప్రొఫైల్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు తొలగించి తన ఖాతా వివరాలతో అప్డేట్ చేశాడు. దీంతో ఒక్కో విద్యార్థికి అందాల్సిన రూ.1,700 అతడి ఖాతాలో జమ అయ్యాయి. నీట్-యూజీ పోర్టల్‌లో మోసపూరిత రీఫండ్ లావాదేవీలు జరుగుతున్నట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఖాతా వివరాల ఆధారంగా నిందితుడిని బిహార్‌లో అరెస్ట్ చేశారు. మొదట నిర్వహించిన నీట్2026 పరీక్షను రద్దు చేయడంతో ఎన్టీఏ అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజును రీఫండ్ చేస్తోందని.. దానిని అవకాశంగా తీసుకొని నిందితుడు ఈ దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన నేపథ్యంలో నీట్ పోర్టల్ భద్రతా ఫీచర్లను ఎన్టీఏ పటిష్టం చేసింది. పాస్వర్డ్లు, ఓటీపీలు లేదా ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని అధికారులు విద్యార్థులను హెచ్చరించారు. పేర్లు, పుట్టిన తేదీలు, సంఖ్యలు వంటి సులువుగా గుర్తించే పాస్వర్డ్లు కాకుండా
కఠినమైన పాస్వర్డ్లు ఉపయోగించాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.