Agricultural Income Tax Freeభారతదేశంలో నిర్దిష్ట ఆదాయ పన్ను వ్యవస్థ అమల్లో ఉంది. ఇక్కడ ఆదాయపు పన్ను చట్టం నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఇందులో పాత లేదా కొత్త పన్ను విధానం అమల్లో ఉండగా ఏదో ఒక దానిని ఎంచుకోవాలి.
వాటి పన్ను శ్లాబులకు అనుగుణంగా టాక్స్ పడుతుంది. ఇక్కడ పన్ను తగ్గించుకునేందుకు వీటిల్లో వెసులుబాట్లు ఉంటాయి. పాత పన్ను విధానంలో టాక్స్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలతో కలిపి రూ. 5.50 లక్షల వరకు మాత్రమే పన్ను పడదు.
తర్వాత టాక్స్ శ్లాబులు అధికంగా ఉంటాయి. కానీ ఇక్కడ పన్ను మినహాయింపు పొందేందుకు చాలా ఆప్షన్లు ఉంటాయి. పెట్టుబడులు, హెల్త్ ఇన్సూరెన్స్, హోం లోన్, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) ఇలా చాలా కేసుల్లో టాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.కొత్త పన్ను విధానంలో చూస్తే మాత్రం ఇక్కడ వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.
75 వేలుగా ఉండగా.. రూ .12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ మినహాయింపులు మాత్రం తక్కువ. చాాల మంది టాక్స్ అంటే వెంటనే సెక్షన్ 80C, HRA, NPS ఈ డిడక్షన్ల గురించే ఆలోచిస్తారు. కానీ భారత ఆదాయ పన్ను చట్టంలో కొన్ని ఆదాయాలకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది.
ఇక్కడ వీటిపై టాక్స్ చెల్లించనక్కర్లేదు. 5 టాక్స్ ఫ్రీ ఇన్‌కం సోర్సెస్ గురించి చూద్దాం.బంధువుల నుంచి వచ్చే బహుమతులు.. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సోదరులు, సోదరీ మణులు, అత్తమామలు వంటి చట్టం గుర్తించిన బంధువుల నుంచి అందుకునే నగదు లేదా ఇతర బహుమతులపై ఎలాంటి టాక్స్ ఉండదు.
అలా అనీ వీటిని విక్రయిస్తే ఉండదనుకోవద్దు. విక్రయించిన సమయంలో క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వంటివి పడతాయి. ఇది వేరే కేటగిరీలోకి వస్తుంది. అంటే
మీ తండ్రి రూ. 10 లక్షలు గిఫ్ట్‌గా ఇచ్చినా, భర్త లేదా భార్య బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు ఇచ్చినా, తాతల నుంచి స్థలం వచ్చినా పన్ను పడదు. ఇక బంధుత్వం లేని వ్యక్తి నుంచి రూ. 50 వేల కంటే ఎక్కువ విలువైన బహుమతి వస్తే ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యవసాయ ఆదాయం.. భారతదేశంలో సాగు చేసే వ్యవసాయ భూమి నుంచి వచ్చే ఆదాయం కూడా పన్ను మినహాయింపులకు వీలు కల్పిస్తుంది. పంటల విక్రయం, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం, వ్యవసాయ భూమి అద్దె వంటివి ఇందులో ఉంటాయి. రైతులకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్రం ఈ వీలు కల్పిస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. కేవలం వ్యవసాయం ద్వారానే ఆదాయం వస్తే దానిపై టాక్స్ పడదు. కానీ వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారం, జీతం ఈ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంపై టాక్స్ లెక్కలు వేరేగా ఉంటాయి. ఇక్కడ వ్యవసాయేతర ఆదాయం కనీస పన్ను మినహాయింపునకు మించి ఉండి.. నికర వ్యవసాయ ఆదాయం రూ. 5 వేల కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మొత్తం ఆదాయంపై టాక్స్ వర్తించేలా చేస్తుంది. ఇక్కడ మిమ్మల్ని అధిక శ్లాబులోకి పడేసే ఛాన్స్ ఉంటుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. మీకు తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపైనా టాక్స్ ఉండదు. ఇందులోకి ఇల్లు, స్థలం, బంగారం, నగదు, షేర్లు వంటివి వస్తాయి. ఇక్కడ వీటిని అందుకున్నప్పుడు ఎలాంటి టాక్స్ పడదు. కానీ తర్వాత ఆ ఆస్తి నుంచి ఆదాయం వస్తే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే వారసత్వంగా వచ్చిన ఇల్లును అద్దెకు ఇస్తే ఇక్కడ అద్దె ఆదాయంపై పన్ను చెల్లించాలి. ప్రభుత్వ పథకాలపై వడ్డీ.. భారతదేశంలో కొన్ని ప్రభుత్వ పథకాలపై గొప్ప పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), వాలెంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF), ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) ఇలా చాలానే ఉన్నాయి. వీటిపై ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్ అంటే పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ రాబడిపై టాక్స్ పడదు. పాత పన్ను విధానంలో వీటిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ.. జీవిత బీమా పాలసీ మెచ్యూర్ అయిన సమయంలో వచ్చే మొత్తం కూడా కొన్ని షరతులకు లోబడి పన్ను రహితంగా ఉంటుంది. దీంట్లో ఎండో మెంట్ పాలసీలు, కొన్ని ULIPs, సంప్రదాయ బీమా పాలసీలు కూడా ఉంటాయి. ఇక్కడ పాలసీ ప్రీమియం, సమ్ అష్యుర్డ్కు సంబంధించి ఆదాయపు పన్ను చట్టం నిర్దేశించిన నిబంధనలు పాటించి ఉండాలి. కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ప్రతి టాక్స్ పేయర్ ఈ విషయాల్ని గుర్తుంచుకోవాలి.