
Visakhapatnam: భూసమీకరణలో భారీ కుంభకోణం.. అక్రమార్కుల గుప్పిట్లో రైతుల భూములు! Visakhapatnam: ముందుగానే కొందరు ఆ భూముల్లోకి చేరిపోయి రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు కొట్టేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెరవెనుక ఈ వ్యవహారం నడిపిస్తున్నారు.
అధికార యంత్రాంగానికి తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదు. దీంతో అసలైన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ఈ అక్రమ దందా జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతాల్లో..: వీఎంఆర్డీఏ ఇటీవల ఆనందపురం మండలం గిడిజాలలో 309.18 ఎకరాలు, గోరింటలో 198.31.
భీమన్నదొరపాలెంలో 122.53, శొంఠ్యాంలో 251.55 ఎకరాల భూసమీకరణ చేపట్టింది. డీపట్టా భూములైతే 450 గజాల అభివృద్ధి చేసిన ప్లాటు, ఆక్రమణదారులైతే 250 గజాల ప్లాటును ప్రభుత్వం పరిహారంగా ఇస్తుంది. భూసమీకరణకు అన్ని చోట్ల గ్రామ సభలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
అయితే వీటిని తూతూమంత్రంగా నిర్వహించారని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. ఎలా కాజేశారంటే: ఆక్రమించిన భూములను ప్రభుత్వం భూసమీకరణ కోసం గుర్తించిందని కొందరు రియల్టర్లు, నాయకులు రైతులకు చెప్పారు. జీడి, మామిడితోటలు ఉన్న భూములను ఎంతకు ఇస్తారో చెప్పండి లేకపోతే ఆ డబ్బులు కూడా రావని భయపెట్టారు.
ఆక్రమిత భూములే కదా అని పలువురు వాటిని అమ్మేశారు. గిడిజాలలో కొండపోరంబోకు భూములను సాగు చేస్తున్న 201మంది రైతులతో స్టాంప్ పత్రాలపై రాయించుకున్నారు. రోడ్డు అనుకొని ఉంటే ఒక ధర లేకపోతే తక్కువ మొత్తం ఇచ్చి కొట్టేశారు. రెవెన్యూ అధికారుల సాయంతో ఎక్కడెక్కడ పట్టా భూములున్నాయి, ఆక్రమణదారులు ఎవరో తెలుసుకున్నారు.
ఆయా రైతుల అవసరాలను గుర్తించారు. కుటుంబ వివాదాలు ఉన్న వారిని ప్రలోభాలకు గురిచేశారు. వారికి ముందుగా కొంత డబ్బులు ముట్టజెప్పి స్టాంప్ పత్రాలపై రాయించుకున్నారు. ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఇచ్చారు. కొందరైతే ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి
.