
భారత్లో ద్విచక్ర వాహనాల మార్కెట్ జోరు కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 2.14 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు అమ్ముడవగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అదే జోరు కనిపిస్తోంది. మే నెల అమ్మకాల గణాంకాలు చూస్తే దేశవ్యాప్తంగా బైక్లు, స్కూటర్లకు డిమాండ్ బలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.తాజా గణాంకాల ప్రకారం 2026 మే నెలలో దేశంలో అత్యధిక ద్విచక్ర వాహనాల అమ్మకాలు నమోదైన నగరంగా ఢిల్లీ నిలిచింది.
గత నెలలో అక్కడ 46,197 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. రెండో స్థానంలో బెంగళూరు 41,717 యూనిట్లతో నిలవగా, హైదరాబాద్ 33,010 యూనిట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. టాప్-5లో చెన్నై, పూణె కూడా చోటు దక్కించుకున్నాయి. చెన్నైలో 27,883 ద్విచక్ర వాహనాలు అమ్ముడవగా, పుణేలో 26,941 యూనిట్లు నమోదయ్యాయి.
ముంబై, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, సూరత్ నగరాలు కూడా టాప్-10లో స్థానం సంపాదించాయి.మే నెలలో మొత్తం ద్విచక్ర వాహనాల మార్కెట్లో మోటార్సైకిళ్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 59.4 శాతం వాటా బైక్లదే. స్కూటర్ల వాటా 30.2 శాతంగా నమోదైంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతూ 8.8 శాతం మార్కెట్ వాటాను సాధించాయి. అయితే ఎలక్ట్రిక్ బైక్ల వాటా మాత్రం ఇంకా 0.1 శాతానికే పరిమితమైంది.రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. మే నెలలో అక్కడ సుమారు 3.14 లక్షల ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
మహారాష్ట్ర 1.82 లక్షల యూనిట్లతో రెండో స్థానంలో, తమిళనాడు 1.42 లక్షల యూనిట్లతో మూడో స్థానంలో నిలిచాయి
.