%2520(1).webp&w=3840&q=75)
ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఇ పోరులో ఒక అద్భుతమైన ఫుట్‌బాల్ డ్రామా ఆవిష్కృతమైంది. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ బరిలోకి దిగిన ఐవరీ కోస్ట్ జట్టు, బలమైన ఈక్వెడార్‌పై 1-0 గోల్ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
ఫిలడెల్ఫియా స్టాడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రెండు జట్లు చివరి నిమిషం వరకు హోరాహోరీగా తలపడ్డాయి. మైదానంలో సుమారు 68,274 మంది ఫుట్‌బాల్ అభిమానులు సాక్ష్యంగా నిలిచిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ అటాకింగ్ గేమ్‌తో ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టాయి.
మ్యాచ్ ఆరంభం నుండి ఈక్వెడార్ జట్టు మైదానంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బంతిని ఎక్కువ శాతం తమ ఆధీనంలో ఉంచుకుంటూ ఐవరీ కోస్ట్ రక్షణ శ్రేణిపై నిరంతరం దాడులు చేసింది. అయితే ఐవరీ కోస్ట్ డిఫెండర్లు ఈక్వెడార్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్నారు.
మొదటి అర్ధభాగంలో ఈక్వెడార్ ఆటగాళ్లు జాన్ యెబోవా మరియు అలాన్ మిండా కొట్టిన రెండు అద్భుతమైన షాట్లు గోల్ పోస్ట్ పైభాగంలోని క్రాస్‌బార్‌కు తగిలి వెనక్కి రావడంతో ఈక్వెడార్ దురదృష్టవశాత్తూ గోల్స్ చేసే అవకాశాలను తృటిలో కోల్పోయింది. మొదటి 45 నిమిషాల ఆట ముగిసేసరికి ఇరు జట్లు 0-0తో సమంగా నిలిచాయి.
రెండో అర్ధభాగంలో ఐవరీ కోస్ట్ వ్యూహాత్మకంగా పుంజుకుంది. 19 ఏళ్ల యువ ఫార్వార్డ్ యాన్ డియోమండే తన అద్భుతమైన వేగంతో ఈక్వెడార్ రక్షణ శ్రేణిని ఒత్తిడిలోకి నెట్టాడు. వరల్డ్ కప్‌లో ఐవరీ కోస్ట్ తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన డియోమండే అందించిన పాస్‌ను ఎలియె వాహి గోల్‌గా మార్చే ప్రయత్నం చేయగా, ఆ బంతి కూడా క్రాస్‌బార్‌కు తగిలి వెనుదిరిగింది.
మ్యాచ్ ముగియడానికి కొద్ది నిమిషాల ముందు ఈక్వెడార్ స్టార్ గొంజালো ప్లాటా కొట్టిన శక్తివంతమైన షాట్‌ను ఐవరీ కోస్ట్ గోల్‌కీపర్ యాహియా ఫోఫానా అద్భుతంగా డైవ్ చేసి కాపాడటంతో మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్నట్లు
అనిపించింది.
కానీ అసలైన ట్విస్ట్ 90వ నిమిషంలో చోటుచేసుకుంది. 56వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన మాంచెస్టర్ యునైటెడ్ వింగర్ అమాద్ డియాల్లో ఐవరీ కోస్ట్ జట్టుకు హీరోగా మారాడు. డిఫెండర్ విల్ఫ్రైడ్ సింగో రైట్ ఫ్లాంక్ నుండి ఈక్వెడార్ పెనాల్టీ ఏరియాలోకి దూసుకువెళ్తూ అద్భుతమైన క్రాస్ పాస్ అందించాడు. కరెక్ట్ టైమింగ్‌తో బాక్స్‌లోకి దూసుకొచ్చిన అమాద్ డియాల్లో ఎడమకాలితో క్లినికల్ షాట్ కొట్టి, బంతిని నేరుగా నెట్లోకి పంపాడు. ఈ గోల్‌తో ఈక్వెడార్ గోల్‌కీపర్ హెర్నాన్ గాలిండెజ్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. ఈ సంచలన గోల్‌తో ఐవరీ కోస్ట్ స్టేడియంలోని అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.
ఈ విజయంతో ఐవరీ కోస్ట్ కీలకమైన 3 పాయింట్లను తన ఖాతాలో వేసుకుని నాకౌట్ దశకు చేరే అవకాశాలను మెరుగుపరుచుకుంది. అంతేకాకుండా, గత 19 మ్యాచ్‌లుగా ఓటమి ఎరుగకుండా దూసుకుపోతున్న ఈక్వెడార్ అజేయ రికార్డుకు ఆఫ్రికన్ చాంపియన్స్ ఐవరీ కోస్ట్ బ్రేక్ వేసింది. ఈ పరాజయం 2024 సెప్టెంబర్ తర్వాత ఈక్వెడార్ జట్టుకు ఎదురైన మొదటి ఓటమి కావడం గమనార్హం. ప్రస్తుతం గ్రూప్-ఇ లో క్యూరాకోను 7-1తో ఓడించిన జర్మనీతో పాటు ఐవరీ కోస్ట్ కూడా సమాన పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
Harmanpreet Kaur: మిథాలీ రాజ్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్!
స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ: సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్, నిఫ్టీ జోరు!
.