బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది'. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.378 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2026లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సౌతిండియా సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆదివారం చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. బుచ్చిబాబుతో పాటుగా నిర్మాత వెంకట సతీష్ కిలారు, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. ‘పెద్ది’ సినిమాలో మరికొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. చాలా మంచి సన్నివేశాలను ఎడిటింగ్ లో లేపేసారని, వాటన్నిటినీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ వెర్షన్ లో చూడొచ్చని నటుడు జగపతిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిపై తాజాగా బుచ్చిబాబు స్పందించారు. ఓటీటీలో కంటే ముందు థియేటర్లలోనే ఆ సన్నివేశాలను జోడించబోతున్నట్లు తెలిపారు. కొత్తగా మూడు సీన్స్ కలిపినట్లు వెల్లడించారు.''ఆల్రెడీ ఎడిట్ చేశాం. వర్క్ అయిపోయింది. ఈ బుధవారం నుంచే థియేటర్లలో కొత్త సీన్స్ యాడ్ అవుతాయి. కొత్తగా 3 సన్నివేశాలను జోడించాం. జాన్వీ కపూర్ ఉన్నవి రెండు సీన్స.. జగపతి బాబుకు సంబంధించిన ఒక సన్నివేశం యాడ్ చేస్తున్నాం. ఏదైతే ఆడియన్స్ మిస్ అయ్యారో ఆ చిన్న చిన్న రౌండప్స్ అన్నీ ఇప్పుడు సినిమాలో ఉంటాయి'' అని బుచ్చిబాబు తెలిపారు. 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర చిత్రీకరణపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బుచ్చిబాబు క్షమాపణలు చెప్పడమే కాదు.. అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సన్నివేశాలను డిలీట్ చేయనున్నట్లు తెలిపారు. విమర్శలపై బుచ్చిబాబు సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. సినిమా చూసిన వారందరూ మెచ్చుకుంటున్నారని, ఒక నాలుగైదు శాతం మంది మాత్రమే అసలు కథ కాకుండా
వేర్వేరు అంశాలు మాట్లాడారని అన్నారు. 95 శాతం మంది సినిమాలోని క్రీడా స్ఫూర్తిని, రామ్ చరణ్ నటనను ప్రశంసించారన్నారు. ''ఎక్కడ పెళ్లి జరిగినా ఎవడో ఒకడు వచ్చి, ‘ఇది బాగోలేదు.. అది బాగోలేదు’ అని అంటాడు. అవన్నీ చిన్న చిన్న విషయాలు. నాది ‘పెద్ది’ తరహాలో పోరాడే పాత్ర'' అంటూ ట్రోలర్స్ కు బుచ్చిబాబు కౌంటర్ ఇచ్చారు.