
యూరప్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ముందుగా ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ తో భేటీ అయ్యారు. ఇరువురూ భారత్-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అలాగే ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యారు. అనంతరం మ్యాక్రాన్ తో కలిసి ప్రధాని మోడీ పారిస్ లోని నైస్ లో భారత్ ఇన్నోవేట్స్ (Bharat Innovates) సదస్సును ప్రారంభించారు. 'భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరాన్ని' ఇరుదేశాలూ జరుపుకుంటున్నందున, 'భారత్ ఇన్నోవేట్స్' ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, ఆవిష్కరణల ప్రపంచానికి సంబంధించిన వారిని ఒకచోట చేర్చే ఒక శక్తివంతమైన వేదికగా నిర్వహిస్తున్నారు. భారత్-ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మ్యాక్రాన్ తో కలిసి తాను సమీక్షిస్తానని ప్రధాని మోడీ అంతకు ముందే ట్వీట్ చేశారు. భారత్ ఇన్నోవేట్స్ ద్వారా వివిధ సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలూ భాగస్వామ్యులు కాబోతున్నాయి. దశాబ్దం క్రితం, ప్రపంచం భారతదేశాన్ని ప్రధానంగా సాంకేతికతను స్వీకరించే దేశంగా చూసిందని, అయితే, నేడు భారతదేశం వేగంగా సాంకేతికతను అందించే దేశంగా ఆవిర్భవిస్తోందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా తెలిపారు.భారత్ నుండి వెలువడే ఆవిష్కరణలు, పరిష్కారాలు మానవాళిలో గణనీయమైన భాగానికి ప్రయోజనం చేకూర్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. ప్రపంచ ఆవిష్కరణల తదుపరి అధ్యాయాన్ని భారతదేశంతో కలిసికట్టుగా సృష్టించడానికి ప్రపంచానికి ఒక ఆహ్వానంగా నిలుస్తూ, 'భారత్ ఇన్నోవేట్స్' ఈ దార్శనికతను పంచుకుంటుందని పేర్కొన్నారు
.