
ఇంటర్నెట్‌డెస్క్: ‘‘ఎక్కడ పెళ్లి జరిగినా ఎవడో ఒకడు వచ్చి, ‘ఇది బాగోలేదు.. అది బాగోలేదు’ అని అంటాడు. అవన్నీ చిన్న చిన్న విషయాలు. నాది ‘పెద్ది’ తరహాలో పోరాడే పాత్ర’’ అన్నారు దర్శకుడు బుచ్చిబాబు. రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అదే సమయంలో కథానాయిక జాన్వీకపూర్ పాత్ర చిత్రీకరణపైనా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బుచ్చిబాబు క్షమాపణ కూడా చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం చిత్ర బృందం విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడారు. ‘‘పెద్ది’లో యాడ్ చేసే సీన్స్ బుధవారం నుంచి థియేటర్లలో ప్రదర్శితమవుతాయి. కథానాయిక జాన్వీకపూర్‌తో పాటు, జగపతిబాబుకు సంబంధించిన సన్నివేశాలు యాడ్ చేస్తున్నాం. ఈ సినిమా చూసిన వారందరూ మెచ్చుకుంటున్నారు. నాలుగైదు శాతం మంది మాత్రమే అసలు కథ కాకుండా వేర్వేరు అంశాలు మాట్లాడారు. 95 శాతం సినిమా అందులోని క్రీడా స్ఫూర్తిని, చరణ్‌గారి నటనను ప్రశంసించారు. ఏ థియేటర్‌కు వెళ్లినా అలాంటి స్పందనే ఉంది’’ అని అన్నారు. జాన్వీ పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శకులకు దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పడం తన నచ్చలేదని సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ అన్నారు. ‘‘ఒక పాత్రను ఎలా తీయాలి? అది ఏ విధంగా ఉంటుందనేది దర్శకుడి ఊహ. ఇంగ్లీష్ బాగా వచ్చి, పీహెచ్డీ, పట్టభద్రులైన వారు మాట్లాడిందే నిజమని ఇప్పటికీ చాలా మంది అనుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్‌మీడియాలో బాగా మాట్లాడేవాళ్ల అభిప్రాయాలను ఇతరులపై రుద్దడంతో వారంతా ప్రభావితమయ్యారు. దర్శకుడికి ఈ మాత్రం స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎలా? ఇలాగే విమర్శించుకుంటూ వెళ్తే దర్శకుల సృజనాత్మకతను తొక్కేసినట్లే. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రజాస్వామ్యబద్ధంగా బుచ్చిబాబు క్షమాపణ చెప్పి ఉండొచ్చు. నాకైతే నచ్చలేదు. ఇలాగే చేస్తుంటే, భవిష్యత్‌లో డాక్యుమెంటరీలు తప్ప, కమర్షియల్ సినిమాలు రావు. ఐటమ్ సాంగ్‌ను
ఐటమ్ సాంగ్గానే స్వీకరించాలి. అదొక స్పెషల్ ఐటెం టేస్ట్ చేసినట్టు.’’ అని అన్నారు. మరోవైపు ఆదివారం నుంచి ఈ మూవీ టికెట్ ధరలు తగ్గాయి. దీంతో రెవెన్యూ మరింత బాగుందని చిత్ర బృందం తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.