పాకిస్థాన్‌తో చర్చల ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంచాలంటూ ఆర్ఎస్ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలు ఇటీవల ఆసక్తికరంగా మారాయి. ఆ వ్యాఖ్యలను ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సమర్థించారు. అయితే, ఆ వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రజలను ఉద్దేశించి చేసినవే అని ఆయన స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్కు స్వతంత్ర విదేశాంగ విధానమేమీ లేదని, పాకిస్థాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో తాము హిట్లర్‌లా వ్యవహరించమంటూ చెప్పారు.మే నెలలో దత్తాత్రేయ హోసబలే ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని భారత్ ఎలా ఎదుర్కోవాలి అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా దేశ భద్రత, ఆత్మ గౌరవాన్ని కాపాడుతూనే పాకిస్థాన్‌తో సంభాషణల ద్వారాలు మూసివేయకూడదని ఆయన అన్నారు. చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలని చెప్పారు. హోసబలే వ్యాఖ్యలను సమర్థించిన మోహన్ భగవత్ పాకిస్థాన్‌లో కూడా భారత విభజన జరిగి ఉండకూడదు అని భావించే అనేక మంది ఉన్నారని చెప్పారు. రెండు దేశాల సిద్ధాంతానికి వ్యతిరేకంగా కలిసి జీవించడం మంచిదని భావించే వర్గం ఇప్పటికీ అక్కడ ఉందన్నారు. "పాకిస్థాన్‌లో చాలా మంది భారత విభజన తప్పు అని నమ్ముతున్నారు. అక్కడ ఉండే కొందరు జర్నలిస్టులు ఆర్ఎస్ఎస్ పనిని ప్రశ్నిస్తున్నారు. రెండు దేశాల సిద్ధాంతానికి వ్యతిరేకంగా కలిసి జీవించడం మంచిదని భావించే వర్గం అక్కడ ఉంది" అని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో భారత్ పాకిస్థాన్‌ను పూర్తిగా ఓడించే పరిస్థితులు వచ్చినా అక్కడి ప్రజలను భారత్‌లో కలుపుకోవాల్సి రావొచ్చు లేదా వారిని అక్కడే శాంతియుతంగా జీవించనివ్వాల్సి రావొచ్చని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. "మేం హిట్లర్‌లా కాదు. అది మా స్వభావం కాదు. మా మార్గం కాదు. అందుకే కొన్ని ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంచాలి. అన్యాయం, దౌర్జన్యాన్ని ఓడించాలి. కానీ మంచిని కూడా కాపాడాలి" అని చెప్పారు. పాకిస్థాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకే తాము మద్దతు
ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.