
రామాలయ విరాళాల చోరీ విచారకరం.. కఠిన శిక్ష పడాల్సిందేనన్న మోహన్ భాగవత్
అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ స్పందించారు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ అంశంలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందేనన్నారు. నాగ్‌పూర్, జులై 5: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల గోల్మాల్ వ్యవహారంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ అంశంలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందేనని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన 'సన్మార్గ్ మైండ్ వెల్నెస్' ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మోహన్ భాగవత్.. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే నిన్ననే దీనిపై స్పష్టమైన ప్రకటన విడుదల చేశారని, తాము ఆ ప్రకటనకే కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ వ్యవహారాన్ని ఒక సాధారణ ఘటనగా తీసుకోకుండా, 'అసాధారణమైనదిగా' పరిగణించాలని ఆర్ఎస్ఎస్ సూచించింది. ఆలయ ఆర్థిక నిర్వహణలో, పరిపాలనా వ్యవస్థలో ఉన్న లోపాలను తక్షణమే సరిదిద్దాలని కోరింది. భక్తుల నమ్మకం వమ్ము కాకుండా ఉండేందుకు భవిష్యత్తులో పారదర్శకమైన ఆర్థిక విధానాలను, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. భక్తులు సంయమనం పాటించాలి: ఆర్ఎస్ఎస్ పిలుపు ఈ క్లిష్ట సమయంలో హిందూ సమాజమంతా అవసరమైన ఓర్పు, సంయమనం పాటించాలని ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ దురదృష్టకర ఘటనను ఆసరాగా చేసుకుని హిందూ ధర్మాన్ని, సమాజాన్ని అపకీర్తి పాలు చేయడానికి ప్రయత్నించే వ్యతిరేక, విద్రోహ శక్తుల కుట్రలను భక్తులు తిప్పికొట్టాలని సంఘ్ పిలుపునిచ్చింది. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి: మోహన్ భాగవత్ ఇదే కార్యక్రమంలో మోహన్ భాగవత్ మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతను కూడా ప్రస్తావించారు. శారీరక అనారోగ్యం మనిషిని బలహీనపరిచినప్పుడు, అది మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుందని, అందుకే సంపూర్ణ ఆరోగ్యానికి ప్రశాంతమైన మనస్సు ఎంతో అవసరమని చెప్పారు