
FIFA World Cup : భారత్ ఇప్పటివరకు ఫిఫా వరల్డ్ కప్‌లో అర్హత సాధించలేకపోయింది. పురుషుల ఫుట్‌బాల్ జాతీయ జట్టు ప్రాతినిధ్యం ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ఇప్పటి వరకూ లేదు. ఈ ఘటన భారీగా క్రీడాభిమానులు కలిగిన భారతదేశంకు పెద్ద లోటేనని చెప్పొచ్చు. 2022 ప్రపంచ కప్‌కు సంబంధించి ఫిఫా విడుదల చేసిన గణాంకాలు.. భారతదేశంలో టెలివిజన్, డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా సుమారు 74.5కోట్ల మంది ఈ టోర్నమెంట్‌ను వీక్షించారు. దీంతో చైనా తరువాత భారతదేశం రెండో అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకులున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలిచింది. మన దేశం ఎప్పుడు ఈ మెగా టోర్నీలో ఎప్పుడు ఆడుతుందా అని కోట్ల మంది భారతీయ క్రీడాభిమానులు దశాబ్దాలుగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ -2026 మెగా టోర్నీలో 48 దేశాలు పాల్గొంటున్నాయి. అందులో భారత్ లేకపోవటంతో కొంద బాధాకరమైనా.. భారతీయ మూలాలున్న నలుగురు ఆటగాళ్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నారు. దీంతో ఈ ఆటగాళ్లు భారత అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన సర్ప్రీత్ సింగ్ ఈ జాబితాలో ప్రముఖుడు. పంజాబ్ మూలాలు కలిగిన 27ఏళ్ల సర్ ప్రీత్ సింగ్ న్యూజిలాండ్ జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గతంలో జర్మనీ దిగ్గజ క్లబ్ బాయెర్న్ మ్యూనిక్‌తో కూడా అనుబంధం కలిగి ఉన్నాడు. అతనికి 2018లో జరిగిన ఇంటర్కాంటినెంటల్ కప్‌లో న్యూజిలాండ్ తరపున ఆడే అవకాశం లభించింది. ఆ టోర్నమెంట్‌లోనే ఆ ఆటగాడు తన తొలి అంతర్జాతీయ గోల్‌ను సాధించాడు. ఖతార్ తరఫున ఆడుతున్న తహ్సిన్ మహమ్మద్ జంషిద్ కేరళకు చెందిన కుటుంబంలో జన్మించాడు. 19ఏళ్ల యువ ఫుట్‌బాలర్ ఖతార్‌లో పెరిగాడు. అక్కడి ఫుట్‌బాల్ టోర్నీల్లో సత్తాచాటి జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ప్రపంచకప్ వేదికపై భారత మూలాలున్న యువ ఆటగాడిగా
ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. కేరళలోని కన్నూర్ జిల్లా వలపట్టణం ప్రాంతానికి చెందిన తహ్సిన్.. జంషీద్ తచ్చంకండి, వాసి షైమా దంపతుల కుమారుడు. తహ్సిన్ కుటుంబం 1996లో ఖతర్‌కు వలస వెళ్లింది. తహ్సిన్ తండ్రి జంషీద్ గతంలో కాలికట్ యూనివర్సిటీ తరఫున ఫుట్‌బాల్ ఆడాడు. తండ్రి అడుగుజాడల్లోనే నడిచిన తహ్సిన్ ప్రస్తుతం జాతీయ జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.
ఆస్ట్రేలియా జట్టులోని నిషాన్ వేలుపిళ్లై తమిళనాడు మూలాలు కలిగిన కుటుంబానికి చెందినవాడు. అతనికి 25ఏళ్లు. తన వేగం, దూకుడైన ఆటతీరుతో ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కీలక ఆటగాడిగా నిలిచాడు. నిషాన్ తల్లి గిలియన్ ఆంగ్లో-ఇండియన్ వంశానికి చెందిన మహిళ కాగా, తండ్రిది శ్రీలంక-మలేషియా నేపథ్యం. ప్రస్తుతం మెల్బోర్న్ విక్టరీ క్లబ్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న ఈ వింగర్.. 2024లో చైల్డ్‌తో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లోనే సూపర్ గోల్ కొట్టి ఆస్ట్రేలియా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ఆఫ్రికన్ దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు ప్రాతినిధ్యం వహిస్తున్న శామ్యూల్ ముత్తుసామి కూడా భారత వంశపారంపర్య సంబంధాలు కలిగిన ఆటగాడే. మిడ్‌ఫీల్డర్‌గా తన జట్టుకు కీలక సేవలు అందిస్తున్నాడు. శ్యామ్యువల్ తండ్రి తమిళనాడుకు చెందిన భారతీయుడు కాగా, తల్లి కాంగో దేశస్థురాలు. ఫ్రాన్స్‌లో పుట్టి పెరిగిన శ్యామ్యువల్, ప్రస్తుతం ప్రసిద్ధ ఫ్రెంచ్ లీగ్‌లోని నాంటెస్ క్లబ్ తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడుతున్నాడు.
భారత్ నుంచి ప్రపంచకప్‌లో ప్రత్యక్షంగా లేకపోయినా.. భారత మూలాలున్న ఈ నలుగురు ఆటగాళ్లు ప్రపంచ ఫుట్‌బాల్ వేదికపై తమ ప్రతిభ చాటడం భారత అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఫుట్‌బాల్‌లో భారతీయుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందనడానికి వీరి ప్రాతినిధ్యం ఒక ఉదాహరణగా నిలుస్తోంది.