నిరుద్యోగ యువత అమాయకత్వాన్ని, ఐటీ ఉద్యోగుల అత్యాశను ఆసరాగా చేసుకుని మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలు సరికొత్త రూపాల్లో కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి తెలుగు రాష్ట్రాల్లో నిషేధానికి గురైన క్యూనెట్ సంస్థ ఇప్పుడు ఇగ్నైట్ అనే సరికొత్త పేరుతో గొలుసుకట్టు మాయాజాలాన్ని విస్తరించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిగ్రీ పూర్తి చేసిన ఒక నిరుద్యోగ యువకుడు ఈ ముఠా చేతిలో చిక్కి మోసపోయాడు. పాత స్నేహితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై.. తాను పెద్ద వ్యాపారం చేస్తున్నానని, రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే చేతినిండా ఆదాయం వస్తుందని నమ్మించాడు. ఓ కాఫీ క్లబ్లో మరో ఇద్దరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి నమ్మకంగా ఆ మొత్తాన్ని వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. తీరా అది క్యూనెట్ అనుబంధ ఇగ్నైట్ మోసమని గ్రహించిన బాధితుడు.. తన తల్లి, అమ్మమ్మల బంగారు నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు పోయిందని కన్నీరుమున్నీరవుతూ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశాడు.గత రెండు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుండి దాదాపు 30 మంది బాధితులు క్యూనెట్, ఇగ్నైట్ సంస్థలపై ఫిర్యాదు చేయడానికి పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటివరకు దాదాపు 300 మందికి పైగా బాధితుల నుండి ఈ ముఠా పెద్దఎత్తున డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఆరుగురు కీలక నిందితులను అరెస్ట్ చేయగా.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి 100కు పైగా గొలుసుకట్టు మాడ్యూల్స్ చట్టవిరుద్ధంగా నడుస్తున్నట్లు సమాచారం.ఈ ముఠా దేశ, విదేశాల్లోని బహుళజాతి కంపెనీల్లో పెట్టుబడులంటూ నమ్మిస్తారు. తాము రెండేళ్ల క్రితం వరకు సామాన్యులమేనని, ఈ వ్యాపారంలోకి వచ్చాకే విదేశీ ప్రయాణాలు చేస్తూ ఆర్థికంగా ఎదిగామంటూ సామాజిక మాధ్యమాల్లో లగ్జరీ ఫొటోలు, వీడియోలు చూపిస్తూ నిరుద్యోగులను ఆకర్షిస్తారు. ఐటీ ఉద్యోగులకు తామే వ్యక్తిగత రుణాలు కూడా
ఇప్పిస్తామంటూ ఆశ చూపుతారు. బాధితుల స్థాయిని బట్టి రూ.5 లక్షల నుండి రూ.20 లక్షల వరకు వసూలు చేసి వాటిని వివిధ షెల్ కంపెనీల ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఒక్కో కొత్త సభ్యుడిని చేర్పించినందుకు ఏజెంట్లకు రూ.45 వేల నుండి రూ.60 వేల వరకు కమీషన్ దక్కుతుండటంతో సభ్యులు పోటీపడి మరీ తమ సొంత స్నేహితులను, బంధువులను ఇందులో లాగుతున్నారు. మార్కెట్లో అతి తక్కువ ధర పలికే వన్ గ్రామ్ గోల్డ్ నగలు, సాధారణ వాచీలకు బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి ఇవి లక్షల విలువైనవని బాధితులకు అంటగడుతున్నారు. వాటిని బయట ఎవరికీ విక్రయించకూడదనే కఠినమైన షరతులు కూడా విధిస్తున్నారు.ఈ గొలుసు దొంగల నెట్వర్క్ అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. హాంకాంగ్ కేంద్రంగా ఇగ్నైట్ సంస్థ కార్యకలాపాలను పద్మాన సేనాపతిరాజా అనే వ్యక్తి పర్యవేక్షిస్తుండగా మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఏజెంట్లు విస్తరించారు. కోల్‌కతాలోని ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్ వద్ద పనిచేసే అటెండర్లు, ప్యూన్ల పేర్లతో ఈ షెల్ కంపెనీలను రిజిస్టర్ చేసి వారిని డైరెక్టర్లుగా చూపించినట్లు విచారణలో తేలింది. భారత్‌లో ఈ దందాను ఓనిల్ గుప్తా, షిప్రా అనే వ్యక్తులు నడిపిస్తున్నారు. పాత క్యూనెట్ దళారుల సాయంతో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్‌లలో రహస్య గ్రూపులు క్రియేట్ చేసి గచ్చిబౌలి, కొండాపూర్లలోని ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ దాదాపు 500 మందిని ఏజెంట్లుగా మార్చుకున్నారు. యువత ఇటువంటి గొలుసుకట్టు వ్యాపార ప్రకటనలను నమ్మి మోసపోవద్దని, పోలీసులకు సమాచారం అందించాలని సీపీ వీసీ సజ్జనార్ సూచించారు.