
గోదావరి నది వరద జలాలపై దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి హక్కులు ఉన్నాయని, ఆ నీటిని వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సమర్థనీయమని ఏపీ జలవనరుల శాఖ విశ్రాంత ఇంజనీర్ల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) 1978లో వెలువరించిన తీర్పును వారు తమ లేఖలో ప్రస్తావించారు. ఎగువ రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు పోగా, దిగువకు ప్రవహించే మిగులు వరద జలాలను వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ స్వేచ్ఛ ఉందని వారు తెలిపారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956 ప్రకారం, ఈ మిగులు జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం గానీ, ఎగువ రాష్ట్రాలు గానీ అభ్యంతరం తెలిపే అధికారం లేదని వారు తేల్చిచెప్పారు.గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకం ద్వారా వరద నీటిని బొల్లపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేసి, కరవు పీడిత ప్రాంతాలైన కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలకు 75 శాతానికి పైగా సాగునీటి భరోసా కల్పించవచ్చని సంఘం వివరించింది. ఈ ప్రాజెక్టు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో వ్యవసాయం, తాగునీటి అవసరాలను తీర్చి, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొంది.గోదావరి జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చర్చలు, న్యాయపరమైన అంశాలు నడుస్తున్న తరుణంలో విశ్రాంత ఇంజనీర్ల సంఘం చేసిన ఈ ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది
.