
అదొక గుట్ట... పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య గుహలు... ఒకరు మాత్రమే వెళ్లగలిగే దారి... ఆ దారి గుండా జాగ్రత్తగా వంగి వెళితే... పూజారులతో పాటు నలుగు రైదుగురు మాత్రమే నిలబడగలిగే చోటు... ఆ ప్రాంతంలో కొలువైన నారసింహుడు కోరిన కోర్కెలు తీర్చే స్వామివారిగా భక్తులు పేర్కొంటారు. అదొక గుట్ట... పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య గుహలు... ఒకరు మాత్రమే వెళ్లగలిగే దారి... ఆ దారి గుండా జాగ్రత్తగా వంగి వెళితే... పూజారులతో పాటు నలుగు రైదుగురు మాత్రమే నిలబడగలిగే చోటు... ఆ ప్రాంతంలో కొలువైన నారసింహుడు కోరిన కోర్కెలు తీర్చే స్వామివారిగా భక్తులు పేర్కొంటారు. దక్షిణ బద్రిగా పేర్కొనే ‘లింబాద్రిగుట్ట... విశేషాలివి... నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ సమీపంలో కొండల నడుమ వెలసిన లింబాద్రిగుట్ట ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక. పురాణాల్లో ఈ క్షేత్రాన్ని ‘నింబాచలం’గా పేర్కొన్నట్లు స్థల పురాణం వివరిస్తోంది. గోదావరి నదికి దక్షిణ దిశలో ఉన్న ఈ ప్రాంతం అనాదిగా రుషులు, మునులు తపస్సు చేసిన పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందింది. నరసింహస్వామి మహిమతో ఈ క్షేత్రం వెలుగొందిందని భక్తులు విశ్వసిస్తారు. బ్రహ్మదేవుడు, నారదుడు, ఆంజ నేయస్వామి, పాండవులు సైతం ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణగాథలు చెబుతున్నాయి. లింబాద్రిగుట్టపై భక్తులను మొదటగా ఆకర్షించేది స్వామివారి దర్శన మార్గమే. సాధారణ ఆలయాల మాదిరిగా కాకుండా... ఇక్కడ గుహలాంటి సహజ మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఆ మార్గం మరీ ఇరుకుగా ఉంటుంది. భక్తులు పెద్ద పెద్ద బండరాళ్లమధ్య తలవంచి, వంగి జాగ్రత్తగా ముందుకుసాగాల్సి ఉంటుంది. వినయంతో స్వామివారి సన్నిధికి చేరుకోవాలనే సందేశాన్ని ఈ మార్గం ఇస్తుందని స్థానికులు చెబుతుంటారు. స్వామి గర్భగుడిలోకి వెళ్లేముందు ఈ మార్గం మరింత ఇరుకుగా ఒక్కరు మాత్రమే వెళ్లగలిగేలా ఉంటుంది. గర్భాలయంలోకి వెళ్లినవారు బయటకు వస్తేనే ఇతరులు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. గర్భగుడిలో లక్ష్మీదేవితో కలిసి యోగముద్రలో కొలువై ఉన్న నరసింహ స్వామి దర్శనం భక్తులను పరవశింపజేస్తుంది. గుహలో వంగి వెళ్లి
స్వామివారిని దర్శించు కోవడం ఈ క్షేత్రానికి ఉన్న విశిష్టతగా చెప్పొచ్చు. ఈ విధంగా మరెక్కడా ఉండదంటారు.
ఉత్తర భారతంలోని బద్రీనాథ్ క్షేత్రానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తూ ‘దక్షిణ బద్రి’గా పిలుస్తారు. దక్షిణ తెలంగాణలో ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా ఇది గుర్తింపు పొందింది. గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామితో పాటు నరనారాయణుల రూపాలు కూడా దర్శనమిస్తాయి. ప్రకృతి సోయగాలు, పురాణ వైభవం, ఆధ్యాత్మిక ప్రశాంతత ఒకేచోట కలిసిన అరుదైన క్షేత్రంగా ఇది నిలిచింది.
లింబాద్రిగుట్టలో వైష్ణవ సంప్రదా యంతో పాటు శైవ సంప్రదాయానికి కూడా విశిష్ట స్థానం ఉంది. ఆలయానికి ఈశాన్య భాగంలో ఉన్న జోడు శివలింగాలు అందుకు నిదర్శనం. శివుడు ఇక్కడ జోడు లింగాల రూపంలో కొలువై ఉంటాడు. నరసింహస్వామి దర్శనం అనంతరం భక్తులు తప్పనిసరిగా ఈ జంట లింగాలను దర్శించుకోవడం ఆనవాయితీ. వైష్ణవ, శైవ సంప్రదాయాల సమన్వయానికి ఈ జంట లింగాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. కోరిన కోరికలు నెరవేరాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఒకే క్షేత్రంలో నరసింహస్వామి, జంట శివలింగాల దర్శనం లభించడం ఈ ఆలయ ప్రత్యేకతగాచెబుతారు.
లింబాద్రిగుట్టలో ప్రతీ ఏడాది కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి జాతర సందర్భంగా గుట్ట ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోతుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి కూడా వేలాది మంది భక్తులు గుట్టకు తరలివస్తారు. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో కల్యాణోత్సవం, గరుడవాహన సేవ, రథోత్సవం, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. భీమ్‌గల్ పట్టణంలోని ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తిని ఘనంగా ఊరేగిస్తూ గుట్టపైకి తీసుకువస్తారు. వేద మంత్రోచ్ఛరణలు, భజనలు, దీపాలంకరణలతో క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో వెలుగొందుతుంది.
లింబాద్రి గుట్టకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఆర్మూర్ చేరుకోవాలి. అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో భీమ్‌గల్ పట్టణం ఉంటుంది. దానికి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట కనిపిస్తుంది. సొంత వాహనాల్లో అయితే నాగ్‌పూర్ హైవేలోఆర్మూర్ వద్ద లేదా గోవింద్‌పేట్ వద్ద ఎగ్జిటై, జగిత్యాల రోడ్లో వేల్పూరు మీదుగా లేదా చెంగల్, బడా భీమ్‌గల్ మీదుగా లింబాద్రి గుట్టకు చేరుకోవచ్చు.
‘‘లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి’ క్షేత్రం నిర్వహణ, నిత్య కైంకర్యాలు శ్రీమదుత్తరాది మఠాధీశుల పర్యవేక్షణలో కొనసాగు తున్నాయి. వైష్ణవ సంప్రదాయాలకు అను గుణంగా ప్రతీరోజూ పూజలు, అర్చనలు, విశేష సేవలు నిర్వహిస్తున్నాం. తంత్రసార విధానంలో జరిగే ఆరాధనలు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆధ్యాత్మిక గుర్తింపును తీసుకొచ్చాయి. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆరాధనా సంప్రదాయాలను యథావిధిగా పరిరక్షిస్తూ ఆలయ వైభవాన్ని కొనసాగిస్తున్నాం.’’
నంబి పార్ధసారథి, ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News