.webp&w=3840&q=75)
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమెరికా ప్రభుత్వ నిధులతో నడుస్తున్న జీవ ప్రయోగశాలల (బయోల్యాబ్ లు) గురించిన రహస్య సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అమెరికా జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (డీఎన్ఐ) తులసి గబ్బార్డ్ అధికారికంగా కొన్ని కీలక పత్రాలను వర్గీకరణ నుంచి తొలగించి అంటే డీక్లాసిఫై చేసి బహిర్గతం చేయడం అంతర్జాతీయంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ నివేదికల ప్రకారం.. ప్రపంచంలోని దాదాపు 30కి పైగా దేశాలలో అమెరికా ఆర్థిక సహాయంతో 120కి పైగా బయోల్యాబ్ లు నిర్వహించబడుతున్నాయి. ఈ మొత్తం ల్యాబ్‌లలో దాదాపు మూడో వంతు, అంటే దాదాపు 40 ప్రయోగశాలలు ఒక్క ఉక్రెయిన్ దేశంలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న యుద్ధ పరిస్థితులలో, ఈ ల్యాబ్‌ల రక్షణ, భద్రతకు తీవ్ర ముప్పుఏర్పడింది. ఈ వివాదాస్పద ల్యాబ్‌లలో సాధారణ పరిశోధనలు కాకుండా ఆంత్రాక్స్, ఎబోలా, సార్స్ (SARS), ప్లేగు వంటి వినాశకరమైన, ప్రాణాంతకమైన క్రిములు, వైరస్‌లపై ప్రయోగాలు జరుగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా, సూక్ష్మజీవుల శక్తిని, వాటి వ్యాప్తి సామర్థ్యాన్ని కృత్రిమంగా పెంచే ‘గైన్-ఆఫ్-ఫంక్షన్’ (జీఓఎఫ్) పరిశోధనలు ఇక్కడ సాగుతున్నాయనే అంశం ఇప్పుడు అంతర్జాతీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిశోధనలను తాము కేవలం బయో-డిఫెన్స్ , వ్యాధుల నివారణ కోసమే నిర్వహిస్తున్నామని అమెరికా సమర్థించుకుంటుంటే.. రష్యా మాత్రం ఇవి ముమ్మాటికీ జీవ ఆయుధాల తయారీ కార్యక్రమాలేనని ఆరోపిస్తోంది. ఈ సంచలన నిజాలు బయటకు వచ్చిన తక్షణమే స్పందించిన ట్రంప్ యంత్రాంగం, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఇటువంటి గైన్-ఆఫ్-ఫంక్షన్ పరిశోధనలకు ప్రభుత్వ నిధులను పూర్తిగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ గడ్డపై జీవ ప్రయోగశాలలకు అమెరికా నిధులు సమకూర్చడం వెనుక దశాబ్దాల చరిత్ర దాగి ఉంది. గతంలో కోల్డ్ ముగిసిన తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ పరిణామాలే దీనికి పునాది వేశాయి. 1990వ దశకం ఆరంభంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు, అక్కడ మిగిలిపోయిన రసాయన, జీవ ఆయుధాల నిల్వలు దుర్వినియోగం కాకుండా
చూడటానికి అమెరికా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. "నున్న-లూగార్" చట్టం లేదా కోఆపరేటివ్ థ్రెట్ రిడక్షన్ (సీటీఆర్) కార్యక్రమం ద్వారా ఉక్రెయిన్, జార్జియా, కజకిస్తాన్ వంటి పూర్వ సోవియట్ రిపబ్లిక్లలో ఉన్న పాత ల్యాబ్‌లను సురక్షితం చేసే బాధ్యత అమెరికా తీసుకుంది.
ప్రారంభంలో ప్రమాదకరమైన వైరస్‌లను, ఆయుధాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ పరిశోధనా కేంద్రాలు.. కాలక్రమేణా ఆధునిక సాంకేతికతతో మరింత బలోపేతమయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ముందు, ఆ తర్వాత కూడా ఈ ల్యాబ్‌ల ఉనికిపై సందిగ్ధత కొనసాగుతూనే వచ్చింది. గత బైడెన్ పరిపాలన కాలంలో ఈ ల్యాబ్‌ల ఉనికికి సంబంధించి అమెరికా అధికారులు భిన్నమైన, పొంతన లేని ప్రకటనలు చేయడంపై తులసి గబ్బార్డ్ అప్పట్లోనే తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆమె స్వయంగా డీఎన్ఐ హోదాలో అధికారిక పత్రాలను బయటపెట్టడం గమనార్హం.
ఈ పరిణామాల నేపథ్యంలో జూన్ 12, 2026న డీఎన్ఐ తులసి గబ్బార్డ్ తన పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు ఈ అసాధారణమైన పత్రాలను బహిరంగ పరిచారు. దశాబ్దాలుగా తెర వెనుక సాగుతున్న ఈ వ్యవహారంలో గత ప్రభుత్వాల అధికారులు, ముఖ్యంగా డాక్టర్ ఫౌసీ వంటి వారు ఈ ల్యాబ్‌ల ఉనికిని, అక్కడ జరుగుతున్న గైన్-ఆఫ్-ఫంక్షన్ ప్రయోగాలను కావాలనే దాచిపెట్టారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా.. గతంలో ఈ ల్యాబ్‌ల గురించిన నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని కూడా గబ్బార్డ్ ఘాటు విమర్శలు చేశారు. ఈ ప్రయోగాల ద్వారా వైరస్‌లను మానవులపై మరింత తీవ్రమైన ప్రభావం చూపేలా మార్పులు చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.
ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ చట్టాల పరిధిలో తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. 1975 నాటి జీవ ఆయుధాల నిషేధ ఒప్పందం (బీడబ్ల్యుసి) ప్రకారం ఎలాంటి జీవ ఆయుధాల అభివృద్ధి, నిల్వ, ఉత్పత్తి పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ ఒప్పందంలో అమెరికా కూడా ఒక భాగస్వామి అయినందున.. తాము ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, కేవలం ప్రపంచ ఆరోగ్య రక్షణ కోసమే ఈ నిధులు ఇస్తున్నామని వాషింగ్టన్ వాదిస్తోంది. అయితే రష్యా మాత్రం, ఉక్రెయిన్ ల్యాబ్‌లలో జరుగుతున్న పరిశోధనలు ద్వంద్వ-వినియోగ స్వభావం కలవని, వీటిని ఏ క్షణంలోనైనా దాడులకు ఉపయోగించే ఆయుధాలుగా మార్చవచ్చని 2022 నుండి ఐక్యరాజ్యసమితి వేదికగా ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగా అమెరికా స్పందిస్తూ.. రష్యా తన దురాక్రమణను సమర్థించుకోవడానికే ఇటువంటి తప్పుడు సమాచార ప్రచారాలు చేస్తోందనీజజ అసలు రష్యాయే చట్టవిరుద్ధమైన జీవ ఆయుధ కార్యక్రమాలను నడుపుతోందని జెనీవా చర్చల్లో ఎదురుదాడికి దిగింది.
ఈ పత్రాల విడుదల కేవలం రాజకీయ ప్రకంపనలకే పరిమితం కాకుండా, మీడియాలోనూ అనేక సందేహాలకు తావిచ్చింది. గబ్బార్డ్ విడుదల చేసిన మ్యాప్‌లలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని అంతర్జాతీయ పరిశోధనాత్మక సంస్థలు ఎత్తిచూపాయి. ఉదాహరణకు, ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతాన్ని తప్పుగా చూపించడం, అలాగే Chernihiv అనే నగరాన్ని Cherniv అని తప్పుగా పేర్కొనడం వల్ల ఈ నివేదిక విశ్వసనీయతపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్, బెల్లింగ్‌క్యాట్ వంటి మీడియా ప్రతినిధులు, గబ్బార్డ్ కేవలం రష్యా ప్రచారానికి బలం చేకూర్చేలా వ్యవహరించారని విమర్శించారు. ఆమె భర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కారణంగా ఆమె పదవి నుంచి తప్పుకునే తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యూహంపై కూడా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయినప్పటికీ.. ట్రంప్ మద్దతుదారులు మాత్రం పాలకుల రహస్యాలను బద్దలు కొట్టి నిజాయితీని కాపాడిన ధీరత్వంగా గబ్బార్డ్ చర్యను కొనియాడుతున్నారు.
ఈ సంచలన వెల్లడి ఫలితంగా అమెరికా విధాన నిర్ణయాల్లో తక్షణ మార్పులు వచ్చాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14292పై సంతకం చేయడం ద్వారా అంతర్జాతీయంగా ఇటువంటి ప్రమాదకర ప్రయోగాలకు ఇచ్చే నిధులను నిలిపివేశారు. ఒకవైపు ప్రభుత్వ పారదర్శకత పెరిగిందని సంతోషించాలా.. లేక ప్రపంచ ఆరోగ్య భద్రత అంతర్జాతీయ రాజకీయాల వల్ల మరింత ప్రమాదంలో పడిందని ఆందోళన చెందాలా అనే చర్చ ప్రజల్లో మొదలైంది. డెమొక్రాట్లు, విదేశీ వ్యవహారాల నిపుణులు మాత్రం, యుద్ధ సమయంలో ఉక్రెయిన్ను మరింత బలహీనపరిచేలా, రష్యాకు రాజకీయ ప్రయోజనం చేకూర్చేలా ఈ పత్రాల విడుదల సమయం ఉందని ఆక్షేపిస్తున్నారు.
మొత్తంగా విశ్లేషిస్తే.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా బయోల్యాబ్‌ల నెట్‌వర్క్‌ను నడుపుతోందనేది ఇక ఎంతమాత్రం కుట్ర సిద్ధాంతం (Conspiracy Theory) కాదు. అది అధికారికంగా ధ్రువీకరించబడిన వాస్తవం. అయితే, ఈ ల్యాబ్‌ల అసలు ఉద్దేశ్యం రక్షణ కోసమా, దాడుల కోసమా అనేది తేలాల్సి ఉంది. యుద్ధ భూమిలో ఇటువంటి అత్యంత భయంకరమైన వైరస్‌లను నిల్వ ఉంచడం అనేది శాంతి సమయాల పరిశోధనల కిందకు వచ్చినా.. యుద్ధ కాలంలో అది పొరుగు దేశాలకు, మానవాళికి ప్రత్యక్ష ముప్పుగా మారుతుందనే గబ్బార్డ్ వాదనను తోసిపుచ్చలేము. సాంకేతిక లోపాలు, రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, అంతర్జాతీయ చట్టాల పటిష్ట అమలు, పారదర్శక పర్యవేక్షణ ద్వారా మాత్రమే ప్రపంచ ఆరోగ్య భద్రతను కాపాడుకోగలమని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.
కారుటైర్లపై ఉండే నంబర్ల రహస్యం ఏంటో తెలుసా?
.