
మహిళల ప్రపంచకప్‌లో భారత్ తొలి పోరు నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఢీ రాత్రి 7 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్‌లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలోనే అత్యంత ఆకర్షణీయమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆదివారమే. ఆట ఏదైనా ఈ చిరకాల ప్రత్యర్థుల పోరు మీద అందరి దృష్టీ ఉంటుంది. క్రికెట్లో అంటే క్రీడాభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతుంది. భారత పురుషుల జట్టు మాదిరే మహిళల బృందం కూడా కొన్నేళ్లుగా పాక్‌పై ఆధిపత్యం చలాయిస్తుండగా.. జోరు కొనసాగిస్తూ దాయాది జట్టును మట్టికరిపించి ప్రపంచకప్ వేటను ఘనంగా ఆరంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహిళల టీ20 ప్రపంచకప్ మొదలై రెండు రోజులు గడిచిపోగా.. భారత జట్టు మూడో రోజు తన తొలి పోరుకు సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ సేన ఆదివారం గ్రూప్-1 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొనబోతోంది. ప్రత్యర్థికి కూడా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. గత ఏడాది వన్డే ప్రపంచకప్ సాధించి ఊపుమీదున్న ఇండియా.. అదే జోరులో పొట్టి కప్పునూ సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్న భారత్.. ఘనవిజయంతో టోర్నీని ఆరంభించాలని పట్టుదలతో ఉంది. ఆల్‌రౌండ్ బలంతో..: ఒకప్పటితో పోలిస్తే భారత మహిళల జట్టు ఎంతగా ఎదిగిందో గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లోనే అందరూ చూశారు. అదేమీ గాలివాటంగా గెలిచిన కప్పు కాదు. ఆస్ట్రేలియాను సెమీస్‌లో ఓడించిన తీరు.. ఫైనల్లో దక్షిణాఫ్రికా సవాలును కాచుకున్న వైనం అద్భుతం. ఆ టోర్నీ తర్వాత అంత నిలకడగా ఆడనప్పటికీ.. ప్రపంచకప్‌లో భారత్‌కు మెరుగైన అవకాశాలే ఉంటాయన్నది విశ్లేషకుల మాట. స్మృతి మంధాన, షెఫాలి వర్మ రూపంలో దూకుడైన ఓపెనర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. తర్వాత జెమీమా, హర్మన్‌ప్రీత్ లాంటి అనుభవజ్ఞుల అండ ఉంది. భార్తీ ఫుల్మాలి రూపంలో జట్టుకు కొత్త హిట్టర్ దొరికింది. ఆమెకు తోడు రిచా ఘోష్ కూడా జట్టుకు మెరుపు ముగింపునివ్వగల బ్యాటరే. దీప్తి శర్మ బ్యాటుతో, బంతితో కీలక పాత్ర పోషించగల
సమర్థురాలు. ఆమెకు తోడు తెలుగమ్మాయి శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్‌ల రూపంలో స్పిన్ ప్రత్యామ్నాయాలు బాగున్నాయి. పేస్ విభాగంలోనే కొంత అనుభవం కొరవడింది. రేణుక సింగ్ మీదే ఎక్కువ ఆశలున్నాయి. క్రాంతి గౌడ్, నందని శర్మ ప్రతిభావంతులే కానీ.. అనుభవ లేమి సమస్య. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డికి తుది జట్టులో చోటు దక్కడం సందేహమే. పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందంటే శ్రేయాంకను.. పేస్‌కు అనుకూలమంటే నందని శర్మను తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది.
పాక్.. పర్వాలేదు: ఒకప్పటితో పోలిస్తే భారత్ బలం పెరగ్గా.. పాక్ జట్టులో పెద్దగా మార్పు లేదు. కాబట్టి ఆ జట్టును ఓడించడం హర్మన్‌ప్రీత్ సేనకు పెద్ద కష్టం కాకపోవచ్చు. స్పిన్ బలం బాగా ఉన్న పాక్.. అందుకు తగ్గ పిచ్ అయితే గట్టి పోటీ ఇస్తుందేమో కానీ, ఇంగ్లాండ్‌లో ఆ జట్టుకు కష్టమే. కెప్టెన్ ఫాతిమా సనా నుంచి ఆ జట్టు ఆల్‌రౌండ్ మెరుపులు ఆశిస్తోంది. ఇక బ్యాటింగ్‌లో ముబీనా అలీ, ఆలియా రియాజ్ ఆ జట్టుకు కీలకం. ఆదివారం మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను బంగ్లాదేశ్ (మధ్యాహ్నం 3 నుంచి) ఢీకొననుంది.
పాకిస్థాన్‌తో 16 టీ20 మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు సాధించిన విజయాలు.
భారత్: స్మృతి, షెఫాలి, జెమీమా, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), భార్తీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్/నందని శర్మ, శ్రీ చరణి, రేణుక సింగ్, క్రాంతి గౌడ్.
పాకిస్థాన్: గుల్ ఫెరోజా, ముబీనా అలీ, నటాలియా, ఆలియా రియాజ్, ఫాతిమా సనా (కెప్టెన్), సైరా జబీన్, ట్యూబా హసన్, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.