
మండలంలోని పర్యాటక ప్రాంతమైన యర్రవరం జలపాతం రోడ్డు పనులు నిలిచిపోయి ఎనిమిది నెలలైనా ఇంకా ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రోడ్డు నిర్మాణానికి రూ.రెండు కోట్లను విడుదల చేసింది. కాంట్రాక్టర్ ఎర్తు వర్కు పూర్తి చేసి వెట్‌మిక్స్ వేసిన అనంతరం అటవీ శాఖ అభ్యంతరంతో పనులు ఆగిపోయాయి. అనంతరం అటవీశాఖ అనుమతులు వచ్చినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మరో మూడు నెలల్లో ప్రారంభం కానున్న పర్యాటక సీజన్ నాటికైనా రోడ్డు పనులు పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలకు కోతకు గురై ప్రమాదభరితంగా మారిన రోడ్డు మూడు నెలల్లో ప్రారభంకానున్న పర్యాటక సీజన్ మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధిలో యర్రవరం జలపాతానికి తురబాడుగెడ్డ నుంచి సమగిరి మీదుగా వెళ్లాలి. ఈ మార్గంలో 12 గ్రామాలున్నాయి. తురబాడుగెడ్డ నుంచి సమగిరి వరకు తారురోడ్డు ఉంది. సమగిరి నుంచి యర్రవరం జలపాతం వరకు వెళ్లేందుకు కేవలం మట్టిరోడ్డు మాత్రమే ఉండేది. దీంతో ఈమార్గంపై కేవలం ద్విచక్రవాహనాలు మినహా ఆటోలు, కార్లు, జీపులు వెళ్లే పరిస్థితి లేదు. శీతాకాల సీజన్లో ఆంధ్రకశ్మీర్ లంబసింగికి వచ్చే పర్యాటకులు అధిక సంఖ్యలో యర్రవరం జలపాతాన్ని సందర్శిస్తుంటారు. పర్యాటకులు సమగిరి వరకు కార్లు, జీపుల్లో వచ్చి అక్కడ నుంచి కాలినడకన జలపాతానికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ఈమార్గం బురదమయమైపోతుంది. కనీసం ద్విచక్రవాహనాలు కూడా నడిచే పరిస్థితి ఉండదు. యర్రవరం జలపాతానికి రహదారి లేకపోవడంతో ఆదివాసీలు, పర్యాటకులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ గత వైసీపీ పాలకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికి ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టూరిజం ప్రాజెక్టులో భాగంగా సమగిరి నుంచి యర్రవరం జలపాతం వరకు నాలుగు కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. ఈమార్గంలో నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ సుమారు ఎనిమిది కల్వర్టులను నిర్మించారు. ఎర్తు వర్కు పూర్తి చేశారు. అయితే రహదారి నిర్మిస్తున్న భూమి కొంత భాగం
అటవీ శాఖ పరిధిలో ఉండడంతో ఆ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో పనులను కాంట్రాక్టర్ నిలిపివేశారు. ప్రస్తుతం అటవీ శాఖ అనుమతులు మంజూరైనప్పటికీ పనులు పునఃప్రారంభించలేదు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు యర్రవరం జలపాతం రహదారి కోతకు గురైంది. రోడ్డుపై వేసిన వెట్‌మిక్స్ పలు చోట్ల కొట్టుకుపోయింది. ప్రస్తుతం రహదారి అధ్వానంగా తయారైంది. ద్విచక్రవహనదారులు ఈమార్గంపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. నాలుగు చక్రాల వాహనాలను నడిపేందుకు వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. మరో మూడు నెలల్లో పర్యాటక సీజన్ ప్రారంభం కానున్నది. పర్యాటక సీజన్‌కి రహదారి అందుబాటులోకి వస్తుందని సందర్శకులు, ప్రాంతీయ ఆదివాసీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
యర్రవరం రోడ్డు నిర్మాణాం వచ్చే నెలలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అభ్యంతరాలు తొలగిపోయాయి. మైదాన ప్రాంతాల్లో నల్లరాయి క్వారీలు మూతపడడంతో కాంట్రాక్టర్ నిర్మాణ పనులను నిలిపివేశారు. క్వారీలు పునఃప్రారంభమయ్యాయి. పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీచేశాం. సీజన్ నాటికి రహదారి పనులు పూర్తి చేస్తాం.