అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నిద్రలేమి సమస్యతో ఓ పంచాయతీ కార్యదర్శి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనకాపల్లి మండలంలోని బవులవాడలో ఈ ఘటన జరిగింది. చోడవరం మండలంలోని గజపతినగరానికి చెందిన వెంకట్ అనే 32 ఏళ్ల వయసు గల వ్యక్తి అల్లూరి జిల్లా మాడుగుల మండలంలోని పెదలోతుల పాలెం పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అయితే వెంకట్ నిద్రలేమి వ్యాధితో ( Insomnia ) బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం రోజున బవులవాడ వద్ద ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలపై లేఖ రాసి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వెంకట్ ఆత్మహత్యపై అతని తండ్రి శంకర్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనకాపల్లి గ్రామీణం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిద్రలేమి.. కారణాలు..రాత్రిపూట సరిగా నిద్రపోలేకపోవడం, తగినంతగా విశ్రాంతి తీసుకోలేని పరిస్థితిని ఇన్ సోమ్నియా లేదా నిద్రలేమిగా వైద్యులు పరిగణిస్తుంటారు. నిద్రలేమి కారణంగా పగటిపూట కూడా అలసటగా అనిపించడం, ఏకాగ్రత లేకపోవటం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇక నిద్రలేమికి పని ఒత్తిడి, ఆందోళనలు కూడా కారణమని వైద్యులు చెప్తున్నారు. మారుతున్న జీవనశైలి, పడుకునే సమయానికి సంబంధించి క్రమశిక్షణ లేకపోవటం కూడా నిద్రలేమికి కారణాలుగా పేర్కొంటున్నారు. అలాగే పడుకునే ముందు సెల్ ఫోన్, టీవీలు చూడటం ద్వారా స్క్రీన్ సమయం పెరిగి సరిగా నిద్రపట్టదని సూచిస్తున్నారు. నిద్రలేమి సమస్య దీర్ఘకాలం కొనసాగితే మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉందంటున్నారు. ఇక నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవటాన్ని అలవాటుగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పడుకోవడానికి ముందు కనీసం గంట పాటు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటే మంచిదని చెప్తున్నారు. పడుకునే గది మనకు అనుకూలమైన ఉష్ణోగ్రత మధ్య ఉండేలా చూసుకోవాలని.. శబ్దాలు రాకుండా నిశ్శబ్దంగా ఉంటే మంచిదంటున్నారు. ప్రతి రోజూ కనీసం ఆరు నుంచి 8 గంటలపాటు నిద్ర అవసరమని సలహా ఇస్తున్నారు. వయసు
ఆధారంగా నిద్ర సమయం ఉంటుందని.. దానిని పాటించాలని సూచిస్తున్నారు.