
జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వచ్చిందంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలు పోస్టులు చేశాయి. ముఖ్యంగా ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రచారంలో ఉన్న ప్రశ్నపత్రం ఫొటోను ఆధారంగా చేసుకుని అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ చిత్రంలో ప్రశ్నపత్రం కోడ్‌తో పాటు కొన్ని వివరాలు కనిపించడంతో ఇది అసలైన పేపరేనంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై దృష్టి సారించిన అధికారులు ఆ సమాచారం పూర్తిగా తప్పుడు ప్రచారం అని నిర్ధారించారు. ఈ అంశంపై స్పందించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ లో వివరణ విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం అయినా కేవలం NEET అధికారిక వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ధృవీకరణ లేని పోస్టులను షేర్ చేయడం వల్ల విద్యార్థుల్లో అనవసర భయాందోళనలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల పరీక్షా వివరాల కోసం అధికారిక ప్రకటనలనే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వాట్సాప్ నంబర్ +91 8799711259 లేదా factcheck@pib.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఇదిలా ఉండగా జూన్ 21న నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొన్ని మార్పులను ప్రకటించింది. విద్యార్థులకు సమయం సరిపడేలా పరీక్ష వ్యవధిని 15 నిమిషాలు పెంచింది. దీంతో పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు కొనసాగనుంది. అదనంగా ప్రశ్నపత్రం బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ కోసం ఇచ్చే పేజీల సంఖ్యను కూడా పెంచారు. గతంలో రెండు పేజీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు నాలుగు పేజీలు అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు మరింత సౌకర్యం కల్పించడమే ఈ నిర్ణయాల ఉద్దేశం అని ఎన్టీఏ వెల్లడించింది. ప్రతిష్ఠాత్మకమైన నీట్ పరీక్షకు సంబంధించి ప్రతి చిన్న సమాచారం కూడా వేగంగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి పోస్టును నిజం అని భావించడం ప్రమాదకరం. పరీక్ష తేదీలు, ప్రశ్నపత్రాలు, ఫలితాలు లేదా ఇతర ప్రకటనల విషయంలో అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవడం విద్యార్థులకు ఎంతో ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ, అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.