
తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం సమీపంలో గణేష్, భవాని దంపతులు పామాయిల్ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వారు తమ రెండేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరితో కలిసి అక్కడే నివసిస్తున్నారు. జూన్ 6న మధ్యాహ్నం సమయంలో చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించింది. అదే సమయంలో కుటుంబం పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా ఆమె వెంట ఉన్నట్లు సమాచారం. కొద్దిసేపటికే పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం, పాప తండ్రి వైపు వెళ్తున్నట్లు ఒక స్థానిక యువకుడు గమనించినట్లు తెలుస్తోంది. అయితే చిన్నారి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా పెంపుడు కుక్క అతడిని అడ్డుకున్నట్లు సమాచారం. ఆ యువకుడు గ్రామానికి వెళ్లి విషయం చెప్పి తిరిగి వచ్చేసరికి పాప, కుక్క రెండూ అక్కడ కనిపించలేదని చెబుతున్నారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పరిణామం ఇప్పుడు కేసులో అత్యంత కీలక అంశంగా మారింది. ఆ సమయంలో అసలు ఏం జరిగిందనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృత స్థాయిలో సెర్చింగ్ చేపట్టారు. పామాయిల్ తోటతో పాటు సమీపంలోని అటవీ ప్రాంతాలు, కొండలు, బోరు బావులు, చెరువులు, పొదలు అన్నింటినీ జల్లెడ పట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలు, డ్రోన్ కెమెరాలు, సాంకేతిక పరికరాల సహాయంతో వారం రోజులుగా గాలింపు కొనసాగుతోంది. తోటలోని ఇనుప కంచె సమీపంలో చిన్నారి వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు లభించాయని సమాచారం. అక్కడి నుంచి కొన్ని ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది. చిన్నారి అదృశ్యమైన మూడు రోజుల తర్వాత ఆమెతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో పోలీసులు దానిని కీలక ఆధారంగా భావించారు. కుక్క కదలికలను గమనించేందుకు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. మళ్లీ అది వెళ్లే
మార్గాన్ని పరిశీలిస్తే చిన్నారి ఆచూకీ లభించవచ్చని ఆశించారు. అయితే ఆశించిన విధంగా ఎలాంటి సమాచారం లభించలేదు. ఇదే సమయంలో కుక్క ఆరోగ్యం క్షీణించడంతో వెటర్నరీ వైద్యులు చికిత్స అందించారు. కానీ అది అనారోగ్యంతో మృతి చెందింది. ఈ పరిణామం కేసులో కొత్త అనుమానాలకు దారితీసింది.
చిన్నారి ఇప్పటికీ దొరకకపోవడంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో కూడా విచారణను వేగవంతం చేశారు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత పరిచయాలు, గత విభేదాలు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, మొబైల్ టవర్ డేటా, కాల్ రికార్డులను విశ్లేషిస్తున్నారు. చిన్నారి తండ్రికి గతంలో కొందరితో విభేదాలు ఉన్నాయనే సమాచారం నేపథ్యంలో ఆ కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. వారం రోజులు గడిచినా ఎలాంటి స్పష్టమైన ఆధారం దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నారి సురక్షితంగా దొరకాలని స్థానికులు ప్రార్థిస్తున్నారు.