Jayshree Ullal Forbes List 2026 : ప్రపంచ సాంకేతిక రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తున్న వేళ.. అమెరికా ఐటీ కారిడార్ సిలికాన్ వ్యాలీలో ఒక భారత సంతతి మహిళ ఎవరూ ఊహించని అద్భుతాన్ని సృష్టించారు. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ అయిన జయశ్రీ ఉల్లాల్.. అగ్రరాజ్యంలో సరికొత్త రికార్డుని నెలకొల్పారు. 2026 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ప్రకటించిన అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ విమెన్ (సొంతంగా ఎదిగిన అత్యంత సంపన్న మహిళలు) జాబితాలో ఆమె అత్యున్నత స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో నిలిచిన ఏకైక భారత సంతతి మహిళ జయశ్రీ కావడం విశేషం.రూ. 56 వేల కోట్లకు పైగా సంపదతో 7వ స్థానంలో..ఫోర్బ్స్ జాబితా తాజా వివరాల ప్రకారం.. జయశ్రీ ఉల్లాల్ నికర ఆస్తి విలువ ఏకంగా 6.8 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 56,700 కోట్లకు పైగా)గా ఉంది. ఈ భారీ సంపదతో ఆమె ఫోర్బ్స్ వార్షిక జాబితాలో ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత రియల్ టైమ్ మార్కెట్ విలువ ప్రకారం ఆమె ఆస్తి 6.5 బిలియన్ డాలర్లుగా ఉన్నప్పటికీ.. ప్రపంచ బిలియనీర్ల సరసన ఆమె అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. నెట్వర్కింగ్, సెమీకండక్టర్ రంగాలలో ఆమె మూడు దశాబ్దాలుగా అందించిన అద్భుతమైన నాయకత్వ పటిమకు ఈ విజయం నిదర్శనంగా నిలిచింది. 2008 నుంచి ఆమె సారథ్యం వహిస్తున్న అరిస్టా నెట్వర్క్స్ సాధించిన విజయాలే ఆమెను ఈ స్థాయికి చేర్చాయి.లండన్ టు ఢిల్లీ.. వయా సిలికాన్ వ్యాలీజయశ్రీ ఉల్లాల్ లండన్‌లో జన్మించినప్పటికీ.. ఆమె బాల్యమంతా దేశ రాజధాని న్యూఢిల్లీలోనే గడిచింది. చిన్నతనం నుంచే టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాలపై ఆమెకు అమితమైన ఆసక్తి ఉండేది. ఉన్నత విద్య కోసం ఆమె అమెరికాకు వలస వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఆ తర్వాత
శాంటా క్లారా యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పట్టా పొందారు. ఈ పటిష్టమైన సాంకేతిక నేపథ్యంతోనే ఆమె అమెరికన్ టెక్ పరిశ్రమలోకి అడుగు పెట్టారు.సిస్కోను వీడి.. 50 మంది ఉన్న స్టార్టప్లోకి!అరిస్టా నెట్వర్క్స్ బాధ్యతలు చేపట్టడానికి ముందు జయశ్రీ సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ సంస్థలైన ఏఎండీ, ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్స్ వంటి కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రముఖ నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో సిస్టమ్స్‌లో చేరి దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తున్న కాలంలో సిస్కో నెట్వర్కింగ్ వ్యాపారాన్ని విస్తరించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అయితే 2008లో ఆమె తన కెరీర్లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే స్థిరపడిన సిస్కో లాంటి దిగ్గజ సంస్థను వదిలిపెట్టి.. కేవలం 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉండి, ఎలాంటి ఆదాయం లేని ‘అరిస్టా నెట్వర్క్స్’ అనే చిన్న స్టార్టప్ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. భవిష్యత్తు అంతా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లదేనని ఆమె బంలగా నమ్మగా.. ఆ నమ్మకమే ఆమె జీవితాన్ని మార్చేసింది.జయశ్రీ వ్యూహాత్మక నాయకత్వంలో అరిస్టా నెట్వర్క్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తిరుగులేని శక్తులలో ఒకటిగా ఎదిగింది. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు, ఏఐ వర్క్‌లోడ్‌లను నిర్వహించేలా హై-పెర్ఫార్మెన్స్ నెట్వర్కింగ్ సొల్యూషన్స్‌ను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. 2014లో ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వెళ్లింది. 2024 నాటికి ఈ కంపెనీ ఏకంగా 9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 75,000 కోట్లు) వార్షిక ఆదాయాన్ని ఆర్జించింది. ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి రేటు కావడం గమనార్హం. ప్రస్తుతం అరిస్టా సంస్థలో జయశ్రీకి 3 శాతం వాటా ఉంది. దీంతో పాటు ఆమె ప్రముఖ క్లౌడ్ కంపెనీ స్నోఫ్లేక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోనూ సేవలు అందిస్తున్నారు.