Small Savings Schemes Interest Rates 2026: పెట్టుబడులు పెట్టేందుకు మనకు చాలానే ఆప్షన్లు ఉన్నాయి. కానీ రిస్క్ ఉన్నవి, రిస్క్ లేని స్కీమ్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి దీర్ఘకాలంలో మంచి రాబడి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ రిస్క్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక రిస్క్ లేని పెట్టుబడి పథకాల్లో పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా చాలానే ఉంటాయి. ఇక్కడ ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరంగా కచ్చితమైన రిటర్న్స్ ఇస్తాయి. వీకం స్టిల్‌లో చాలా పథకాల్లో దీర్ఘకాలంలో మంచి రాబడి అందడంతో పాటుగా పన్ను ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో పాత పన్ను విధానంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపుల్ని పొందే వీలుంటుంది. ఈ పోస్టాఫీస్ పథకాల్లో ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కం స్కీమ్ వంటివి అత్యంత ఆదరణ పొందాయి. వీటిల్లో అత్యధికంగా సుకన్య సమృద్ధితో పాటుగా సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీంలో వడ్డీ రేట్లు వార్షికంగా 8.20 శాతంగా ఉంది. సాధారణంగా ఈ పథకాల వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. చాలా కాలంగా రేట్లు స్థిరంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లు అమల్లో ఉండగా.. జులై- సెప్టెంబర్ త్రైమాసికం వడ్డీ రేట్లను మళ్లీ సమీక్షించనుంది. ఈ స్కీమ్స్ గురించి చూద్దాం.సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఇది కేవలం సీనియర్ సిటిజెన్లకే అందుబాటులో ఉన్న పోస్టాఫీస్ పథకం. ఇక్కడ 60 ఏళ్లు పైబడిన వారు చేరొచ్చు. ఇక్కడ ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. ఒకేసారి పెట్టుబడి పెట్టే పథకం. కనీసం రూ. 1000 తో చేరొచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ. 30
లక్షలుగా ఉంటుంది. ఐదేళ్లు కాల పరిమితిగా ఉండగా.. మూడేళ్ల టెన్యూర్ చొప్పున పొడిగించుకోవచ్చు. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీకి మీ పెట్టుబడి మొత్తం కూడా తిరిగొస్తుంది.సుకన్య సమృద్ధి అకౌంట్ (SSA) స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో అత్యంత ఆదరణ పొందిన పథకాల్లో దీని గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇది కేవలం ఆడపిల్లల కోసమే అందుబాటులో ఉన్న స్కీమ్. ఇక్కడ కూడా వడ్డీ రేటు వార్షికంగా 8.20 శాతంగా ఉంది. పదేళ్లలోపు ఆడపిల్లలే ఇందులో చేరాలి. వరుసగా 15 ఏళ్లు డబ్బులు కట్టాలి. కనీసం ఏడాదికి రూ. 250 నుంచి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు జమ చేయాలి. అకౌంట్ తెరిచినప్పటి నుంచి 21 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది. ఇక్కడ పెట్టుబడి, వడ్డీ, రాబడిపై టాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) ఈ పోస్టాఫీస్ స్కీమ్ కూడా ఇన్వెస్టర్లకు గ్యారెంటీ రిటర్న్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు వార్షికంగా 7.7 శాతంగా ఉంది. ఇక్కడ కూడా టాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కీమ్ టెన్యూర్ ఐదేళ్లుగా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక్కసారి పెట్టుబడితో ఐదేళ్ల తర్వాత నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం రాబడి వస్తుంది. కనీసం రూ. 1000 పెట్టుబడితో చేరొచ్చు. గరిష్టంగా ఎంతైనా జమ చేయొచ్చు. మంత్లీ ఇన్‌కం స్కీమ్ (MIS) చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనే అత్యంత ఆదరణ పొందిన స్కీమ్స్‌లో మంత్లీ ఇన్‌కం స్కీమ్ (MIS- నెలవారీ ఆదాయ పథకం) కూడా ఉంది. దీంట్లో వడ్డీ రేటు ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.40 శాతంగా ఉంది. ఇక్కడ టెన్యూర్ ఐదేళ్లుగా ఉండగా.. ఒక్కసారి పెట్టుబడితో ప్రతినెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందొచ్చు. ఇక్కడ కూడా కనీసం రూ. 1000 పెట్టుబడితో చేరొచ్చు. ఇక గరిష్ఠ పెట్టుబడి పరిమితి సింగిల్ అకౌంట్‌కు రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంట్‌కు రూ. 15 లక్షలుగా ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పీపీఎఫ్ స్కీంలో వడ్డీ రేటు వార్షికంగా 7.10 శాతంగానే ఉన్నప్పటికీ ఇందులో చాలా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి అందించేందుకు ఈ స్కీమ్ గొప్ప ఆప్షన్‌గా ఉంది. ఇక్కడ కనీసం ఏడాదికి రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఇక్కడ కూడా వరుసగా 15 ఏళ్లు జమ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై టాక్స్ ఉండదు. మెచ్యూరిటీ తర్వాత ఐదేళ్ల చొప్పున అకౌంట్ పొడగించుకోవచ్చు.