విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సూరిబాబు అనే కాంట్రాక్ట్ కార్మికుడు శనివారం చనిపోయారు. జూన్ 8వ తేదీన విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కుద్రవం లీకై ప్రమాదం చోటుచేసుకుంది.
ప్లాంట్‌లోని స్టీల్ మెల్డింగ్ షాప్ -2లో ద్రవ ఉక్కు ల్యాడిల్ పేలటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం రోజున సూరిబాబు అనే ఉద్యోగి చనిపోవటంతో మృతుల సంఖ్య పదికి చేరింది. ప్రమాదం ఎలా జరిగిందంటే?స్టీల్ మెల్డింగ్ షాప్ -2, ఎస్టీసీ -3 హీట్ ఎఫ్జీ విభాగంలో వేడి ఉక్కు ద్రవాన్ని క్రేన్ ద్వారా లిఫ్ట్ చేస్తున్న సమయంలో ల్యాడిల్ పేలటంతో ఈ ప్రమాదం జరిగింది.
ల్యాడిల్ పేలి ద్రవ ఉక్కు మీద పడటంతో కింద ఉన్న కార్మికులు సజీవ దహనమయ్యారు. సుమారుగా 1500 డిగ్రీల వేడితో ఉన్న లిక్విడ్ మీద పడటంతో కార్మికులకు తప్పించుకునే సమయం కూడా లేకపోయిందని సమాచారం. ఈ ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగసిపడగా..
ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను నియంత్రించారు. ప్రభుత్వం స్పందన.. త్రిసభ్య కమిటీ నియామకం మరోవైపు ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల పరిహారంతో పాటుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.
అలాగే ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 22 మంది అధికారులపై చర్యలు..మరోవైపు స్టీల్ ప్లాంటులో వరుస ప్రమాదాల నేపథ్యంలో 22 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. శుక్రవారం రోజున స్టీల్ ప్లాంటులోని లాడిల్స్, సెంట్రల్ స్టోర్స్‌ను ఉన్నతాధికారులు తనిఖీ చేశారు.
ఈ సమయంలో నాసిరకం ఫెర్రో ఎల్లాయ్స్ వెలుగుచూడటంతో 22 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ చేయటం కాదని.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు, కార్మిక
సంఘాల నేతలు కోరుతున్నారు.