
Kotha malupu Review || చిత్రం: కొత్త మలుపు; నటీనటులు: ఆకాశ్, భైరవి ఆర్థ్యా, రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి, మహేందర్, ఐశ్వర్య, సిద్ధు తదితరులు; సంగీతం: యశ్వంత్ నాగ్; ఛాయాగ్రహణం: సుమంత్ కచర్ల, జవహర్ రెడ్డి; నిర్మాత: తాటి బాలకృష్ణ; దర్శకత్వం: శివ కేసనకుర్తి; విడుదల తేదీ: 12-06-2026 ‘సర్కారు నౌకరి’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు గాయని సునీత కుమారుడు ఆకాశ్. ఇప్పుడాయన నుంచి వచ్చిన రెండో సినిమా ‘కొత్త మలుపు’. మరి ఈ చిత్ర కథేంటి? హీరోగా ఆకాశ్ కెరీర్‌ని మలుపు తిప్పిందా? Kotha malupu story || ఏ బాధ్యతలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని గడిపేసే హైదరాబాదీ కుర్రాడు కమల్ (ఆకాశ్). ఓసారి తన కుటుంబ వివాహ వేడుక కోసం కోనసీమ జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరికి వెళ్లగా.. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే అమ్మాయి తారసపడుతుంది. దీంతో తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు కమల్. ఓరాత్రి వేళ అవమానకర పరిస్థితుల్లో చిక్కుకున్న కమల్‌ను గుర్తు తెలియని యువతి కాపాడుతుంది. ఆమెను వెతికి పట్టుకునేందుకు వరలక్ష్మితో కలిసి అన్వేషణ ప్రారంభిస్తాడు కమల్. మరి అలా మొదలైన వాళ్లిద్దరి ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది? ఈక్రమంలో కమల్‌కి కనిపించిన ఓ ఫొటో వల్ల వాళ్ల మధ్య ఎలాంటి అనుమానాలు, అపార్థాలు తలెత్తాయి? తాను వెతుకున్న అమ్మాయికి.. తను మనసు పారేసుకున్న వరలక్ష్మికీ ఏమైనా సంబంధం ఉందా? లేదా? ఆఖరికి ఈ ప్రేమకథ గెలిచిందా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. Kotha malupu Review || ఇద్దరి మధ్య ప్రేమలో ఓ అనుమానం మొదలైతే.. అదెంతటి ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతుందో తెలియజెప్పే చిత్రమిది. ఈ ప్రేమకథకు కోనసీమ అందాలు జోడించి ప్రేక్షకులకు ఓ ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అయితే ఆ పల్లెటూరి విజువల్స్ కనులకు ఇంపుగా అనిపించినా.. ప్రథమార్ధంలో కథలో
పెద్దగా వేగం కనిపించకపోవడం ప్రేక్షకుల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. ఏ లక్ష్యం లేకుండా జీవితాన్ని సరదాగా గడిపేసే కుర్రాడిగా హీరో పరిచయ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. ఎప్పుడైతే పెళ్లి వేడుక కోసం కోనసీమలోకి అడుగు పెడతాడో.. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.
నాయకానాయికల పరిచయ సన్నివేశాలు, పెళ్లి వేడుకలో చేసే హంగామా, గోదారోళ్ల అల్లరి అన్నీ కాలక్షేపాన్నిస్తాయి. ఓ చిన్న ట్విస్ట్‌తో ప్రథమార్ధానికి విరామమిచ్చిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. ఇక ద్వితీయార్ధంలో కథంతా ఎమోషనల్ టచ్‌తో సాగుతుంది. ఓ ఫొటో వల్ల కమల్ - వరలక్ష్మిల ప్రేమ ప్రయాణంలో అలజడి మొదలవడం.. అనుమానాలు - అపార్థాలు చోటు చేసుకోవడం.. ఈ క్రమంలో ఇద్దరూ పడే మానసిక వేదన అన్నీ హత్తుకుంటాయి. గతాన్ని చూసి ఓ వ్యక్తి వర్తమానాన్ని జడ్జ్ చేయకూడదనే సందేశాన్నిస్తూ క్లైమాక్స్‌ని తీర్చిదిద్దిన తీరు యువతరానికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
కమల్ పాత్రలో ఆకాశ్ చక్కగా ఒదిగిపోయాడు. ప్రథమార్ధంలో అల్లరి కుర్రాడిగా నవ్విస్తూనే.. ద్వితీయార్ధంలో భావోద్వేగభరితమైన నటనని కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి వరలక్ష్మి పాత్రలో భైరవి తెరపై కనిపించిన తీరు.. ఆమె సహజమైన నటన.. ఆకాశ్‌తో కెమిస్ట్రీ అన్నీ ఆకట్టుకుంటాయి. రఘుబాబు, పృథ్వీ అక్కడక్కడా నవ్వించారు. ప్రభావతి, మహేందర్, ఐశ్వర్య, సిద్ధు తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకున్నా.. దాన్ని కోనసీమ నేపథ్యం నుంచి ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ పల్లెటూరి అందాల్ని సుమంత్, జవహర్ రెడ్డి తమ కెమెరాల్లో చక్కగా బంధించి చూపించారు. యశ్వంత్ నాగ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.