Thane Matrimonial Fraud Arrest : పెళ్లి పేరుతో అమాయక, నిస్సహాయ మహిళలను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు కాజేస్తున్న ఒక అంతర్రాష్ట్ర కేటుగాడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, వార్తాపత్రికల ప్రకటనల ద్వారా పరిచయమై ఏకంగా 25 మందికి పైగా మహిళల జీవితాలతో ఆడుకున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అనూజ్‌కుమార్ చంద్రప్రకాష్ త్రివేది అనే ఘరానా మోసగాడిని ఠాణే పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఒక వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ దగాకోరు నెట్‌వర్క్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. వృద్ధురాలి ఫిర్యాదుతో బయటపడ్డ మోసాలు..ఈ ఘోర మోసాలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి రావడానికి 2022 మార్చిలో ఓ వృద్ధురాలు చేసిన ఫిర్యాదే కారణం. మహారాష్ట్రలోని ఠాణే పోలీసులకు ఒక వృద్ధురాలు తన మనవరాలి జీవితాన్ని ఒక మోసగాడు నాశనం చేశాడంటూ ఫిర్యాదు చేశారు. 2019లో పత్రికలో వచ్చిన ఒక వివాహ ప్రకటన ఆధారంగా అజయ్ అగర్వాల్ అనే నకిలీ పేరుతో పరిచయమైన త్రివేది.. ఆమె మనవరాలిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్దిరోజులకే కొత్త ఫ్లాట్ కొనాలని, మరో ఇల్లు నిర్మించాలంటూ సదరు కుటుంబంపై ఒత్తిడి తెచ్చాడు. నమ్మిన బాధితులు వివిధ విడతల్లో అతనికి ఏకంగా రూ.82 లక్షల నగదును అందజేశారు. అంతటితో ఆగని ఈ కేటుగాడు.. 2022 ఫిబ్రవరిలో ఒక బంధువుల పెళ్లికి వెళ్తున్నానని నమ్మించి, ఇంట్లోని 33 తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు.ఇదీ చూడండి: నిత్య పెళ్లికొడుకు.. ఒకరికి తెలియకుండా మరొకరితో.. పెద్ద లిస్టే ఇదీ..!వితంతువులు, దివ్యాంగులే టార్గెట్..!బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఠాణే సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు అనూజ్ కుమార్ త్రివేదిని పట్టుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. త్రివేది ఒక్క ఈ అమ్మాయినే కాకుండా.. ఇదే తరహాలో మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా దాదాపు 25 మందికి పైగా మహిళలను దగా చేసినట్లు
పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వితంతువులు, దివ్యాంగులైన మహిళలనే ఈయన తన ప్రధాన లక్ష్యంగా ఎంచుకునేవాడని.. వారిపై సానుభూతి నటిస్తూ, పెళ్లి చేసుకుని, ఆపై వారి వద్ద ఉన్న నగదు, బంగారంతో ఉడాయించడం ఇతడికి అలవాటుగా మారిందని తెలుసుకున్నారు. ఇదీ చూడండి: పెళ్లి చేసుకుని మోజు తీరాక పరార్.. వంచకుడి వలలో చిక్కిన 8 మంది మహిళలుమహిళలను మోసం చేసిన డబ్బులతో బీఎమ్‌డబ్ల్యూ కార్..!మహిళలను మోసం చేసి సంపాదించిన కోట్ల రూపాయల అక్రమ సొమ్ముతో త్రివేది విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. బాధితుల సొమ్ముతో ఏకంగా ఒక లగ్జరీ బీఎండబ్ల్యూ కారును కూడా కొనుగోలు చేశాడు. నిందితుడి అరెస్టు అనంతరం పోలీసులు ఆ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘోర మోసాల్లో త్రివేది ఒంటరిగా కాకుండా అతని కుమారుడిని కూడా భాగస్వామిగా చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తండ్రి చేసే పెళ్లిళ్ల దందాకు, వసూళ్లకు కుమారుడు కూడా సహకరించడంతో పోలీసులు అతనిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.