
రుద్రంపూర్, జూన్ 13 : జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గంలో మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాద భరితంగా మారింది. రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మూలమలుపు తిరిగిన వెంటనే ఈ గుంత ఉండటంతో రాత్రి వేళల్లో ప్రమాదాల ప్రమాదం అధికంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఫిల్టర్ బెడ్‌కు సంబంధించిన పైపుల ఏర్పాట్ల కోసం రహదారికి ఇరువైపులా తవ్వకాలు చేపట్టారు. అయితే పనులు పూర్తయిన అనంతరం తవ్విన ప్రాంతాలను సక్రమంగా పూడ్చకపోవడంతో పాటు మరమ్మతులు చేపట్టకపోవడంతో వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతింది. దీంతో రహదారి మధ్యలో గుంత ఏర్పడటంతో పాటు పక్కల భాగాలు కూడా ఎత్తుపల్లాలుగా మారాయి. మూలమలుపు కారణంగా ఎదురుగా వస్తున్న గుంతను గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఆదమరిచి వెళితే గుంతలో లేదా రహదారి పక్కనున్న ఎత్తుపల్లాలలో టైర్లు జారి కిందపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత సింగరేణి అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని, ప్రమాదాలు జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. [caption id="attachment_2419306" align="alignnone" width="1200"] ప్రమాద భరితంగా జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గం[/caption]