తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. టీటీడీ భక్తుల సౌకర్యార్థం ప్రతి నెలా ఆన్లైన్లో దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను విడుదల చేస్తోంంది సెప్టెంబర్
నెలకు సంబంధించి టీటీడీ వివిధ దర్శనాల, గదుల కోటాకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18న ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించాలి. జూన్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. అదే రోజు (జూన్ 22న) మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూన్ 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. జూన్ 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. జూన్ 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.జూన్ 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదే రోజు (జూన్ 24న) మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి.. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తిరుమల శ్రీవారికి ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్ పోర్ట్ ఇంఛార్జ్ జీఎం లక్ష్మీ ప్రసన్న, తిరుమల డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.