ఫుట్‌బాల్ ప్రపంచంలో అంచనాలు వేయడం అంత సులభం కాదు. స్టార్ ఆటగాళ్లు, ఫామ్, గాయాలు, అదృష్టం.. ఎన్నో అంశాలు మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తుంటాయి. అయితే గత మూడు ఫిఫా వరల్డ్‌కప్‌ల విజేతలను వరుసగా
కరెక్ట్‌గా అంచనా వేసిన ఓ ఆర్థికవేత్త ఇప్పుడు 2026 ప్రపంచకప్ విజేతపై తన జోస్యాన్ని వెల్లడించాడు. దీంతో అతడి తాజా అంచనా ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.జర్మనీకి చెందిన ఆర్థికవేత్త జోయాకిమ్ క్లెమెంట్ జనాభా పరిమాణం, జట్టు ర్యాంకింగ్‌ల వంటి గణాంకాల ఆధారంగా ప్రత్యేక మోడల్‌ను రూపొందించారు. ఈ మోడల్ 2014లో జర్మనీ, 2018లో ఫ్రాన్స్, 2022లో అర్జెంటీనా ప్రపంచకప్ గెలుస్తాయని ముందుగానే అంచనా వేసింది. ఆశ్చర్యకరంగా ఆ మూడూ నిజమయ్యాయి.అయితే తన విజయాలను క్లెమెంట్ అదృష్టంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఫుట్‌బాల్‌లో అనూహ్య పరిణామాలు ఎప్పుడైనా చోటుచేసుకోవచ్చని, తన మోడల్ కేవలం కొంతవరకే ఫలితాలను అంచనా వేయగలదని చెప్పారు. ‘‘నాకేమీ క్రిస్టల్ బాల్ లేదు. వరుసగా మూడు సార్లు సరైన అంచనా చెప్పడం అదృష్టమే కావచ్చు’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఇప్పుడు 2026 ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా నెదర్లాండ్స్ నిలుస్తుందని క్లెమెంట్ అంచనా వేశారు. ‘‘జర్మన్‌గా చెప్పడం బాధగా ఉన్నా, ఈసారి నెదర్లాండ్స్ తమ చరిత్రలో తొలి వరల్డ్‌కప్‌ను గెలుస్తుందని నేను భావిస్తున్నాను’’ అని వెల్లడించారు. అతడి గత రికార్డు దృష్ట్యా ఈ అంచనా ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.