
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై దృష్టిపెట్టిన అగ్రరాజ్యం అమెరికా తాజాగా కీలక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో డ్రగ్స్ ముఠా ట్రెన్ డి ఆరాగ్వా గ్యాంగ్‌కు చెందిన
లీడర్ హెక్టర్ రస్తెన్‌ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు.
‘‘ట్రెన్ డి ఆరాగ్వా ఉగ్రవాదులకు వెనెజువెలాలోనే కాదు.. ఈ భూమ్మీద ఎక్కడా సురక్షిత స్థావరం ఉండదు. హంతకులు, డ్రగ్ లార్డ్స్ ఎక్కడున్నా వేటాడుతాం. వారిని నరకానికి పంపిస్తాం’’ అని ట్రంప్ వెల్లడించారు. ఈ వారం ఆరంభంలో అమెరికా ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. అత్యంత పక్కా సమాచారంతో ట్రెన్ డి ఆరాగ్వా ముఠాకు చెందిన ఓ కాంపౌండ్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో గురెరో అక్కడికక్కడే మృతిచెందినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్‌హౌస్ షేర్ చేసింది.
ఈ ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. గురెరో తలపై 5 మిలియన్ డాలర్ల రివార్డ్ కూడా ఉంది. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ట్రెన్ డి ఆరాగ్వా ముఠా దశాబ్దం క్రితం ఆరాగ్వా నగరంలోని ఓ జైల్లో ఏర్పాటైంది. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో నియంత్రణలో ఈ గ్యాంగ్ పనిచేస్తోందనే ఆరోపణలున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ముఠా ఆగడాలు మితిమీరిపోయాయి. జైళ్లనే స్థావరాలుగా మార్చుకొని.. అక్కడి నుంచే దోపిడీలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ ముఠాను స్థానికంగా ‘రక్తపిపాసి’గా పిలుస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.