
ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది జలాలు అందకుండా చేస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు
. హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ శాఖ నిర్వహించిన 'మేధావుల సదస్సు'లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి, సామరస్య భాష అర్థం చేసుకోని వారికి ఎలా బదులివ్వాలో 'ఆపరేషన్ సిందూర్' ద్వారా తమ ప్రభుత్వం ప్రపంచానికి చాటిచెప్పిందని ఆయన అన్నారు.పహల్గాం ఉగ్రదాడి ఘటనను ప్రస్తావిస్తూ.. "ఉగ్రవాదుల దుశ్చర్యల పట్ల కన్నీళ్లు రానివారు, మా నుంచి నీళ్లు ఆశించవద్దు. మానవత్వ శత్రువులకు, ఉగ్రవాద సానుభూతిపరులకు సింధు నది జలాలను చేరనివ్వబోం" అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవు' అనే వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ తన సార్వభౌమ హక్కులను ఉపయోగించుకుని సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్ల్యూటీ) తాత్కాలికంగా నిలిపివేసిందని ఆయన తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతును శాశ్వతంగా విరమించుకునే వరకు ఈ ఒప్పందంపై తమ వైఖరి మారదని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా ఒప్పందాలు కొనసాగవని భారత్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సింధు నదీ జలాల వినియోగంపై 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్థాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ విజయాలను వివరిస్తూ, రాజ్‌నాథ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.