ఆయన జిల్లా విద్యాశాఖ అధికారి.. కీలక బాధ్యతల్లో ఉన్న ఆయన విద్యార్థిలా మారిపోయారు. పిల్లలతో కలిసి యూనిఫామ్ వేసుకుని స్కూల్‌కు వెళ్లారు. జిల్లా విద్యాశాఖ అధికారి యూనిఫామ్‌లో రావడం చూసి అందరూ
అవాక్కయ్యారు. అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు కాస్త వినూత్నంగా ఆలోచించి ఇలా చేశారు. ఏపీలో శుక్రవారం నుంచి వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు చోడవరంలోని కొత్తూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లారు. ఆయన కూడా విద్యార్థుల్లాగే యూనిఫామ్ ధరించారు. స్కూల్లో నిర్వహించిన మన బడి- మన పండుగ కార్యక్రమానికి డీఈవో హాజరయ్యారు. ఆయన స్కూల్ విద్యార్థినిలు, ఉపాధ్యాయులతో కలిసి ఉదయం ప్రార్థనలో పాల్గొన్నారు. ఆ తర్వాత క్లాస్‌రూమ్‌లకు వెళ్లి విద్యార్థినులకు చాక్లెట్లు, ఆపిల్ పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యాబోధన ఉంటుందని.. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. డీఈవో వినూత్న ఆలోచనను అందరూ ప్రశంసించారు.. గిడ్డి అప్పారావును విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా అభినందించారు. 'ఐక్యత- క్రమశిక్షణకు చిహ్నమైన యూనిఫామ్ ధరించిన విద్యార్థుల్లో తానూ ఒకరై అందరికీ ఆదర్శంగా నిలిచిన అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు గారికి అభినందనలు. వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభం అయిన చోడవరం మోడల్ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌కు యూనిఫామ్ ధరించిన డీఈవో, విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రార్థనలో పాల్గొని, ప్రతిజ్ఞ చేయడం స్ఫూర్తిదాయకం' అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవులు పూర్తికావడంతో స్కూల్స్ పునఃప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తొలి రోజు మన బడి- మన పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పలు స్కూళ్లలో టీచర్లు విద్యార్థుల్ని పూలు, చాక్లెట్లతో స్వాగతం పలికారు. డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, టీచర్లు హాజరై ప్రభుత్వం సరఫరా చేసిన ఫ్రీ బుక్స్, నోట్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. అంతేకాదు ఈ ఏడాది కొత్తగా ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. తొలిరోజు స్కూల్‌కు కొంతమంది విద్యార్థులు హాజరుకాలేదు. శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం నుంచి వచ్చే అవకాశం ఉందంటున్నారు.