
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై గత కొంత కాలంగా చర్చ సాగుతూనే ఉంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటనకు వెళ్లినప్పుడల్లా.. తెలంగాణ మంత్రులు, ముఖ్య నేతలు ఢిల్లీలో
అడుగుపెట్టినప్పుడల్లా.. కేబినెట్ విస్తరణ తెరపైకి వస్తూనే ఉంది.. అయితే, దీనికి క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్ విస్తరణపై ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగడం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ సందర్భంగా పలు రాజకీయ, పరిపాలనా అంశాలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం సమర్థవంతంగా పనిచేస్తోందని పేర్కొన్న రేవంత్ రెడ్డి, కేబినెట్ విస్తరణ అవసరం వచ్చినప్పుడు తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులకు అర్హులేనని, అయితే రాజ్యాంగ పరిమితులు, ఇతర అంశాల కారణంగా అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడని, పార్టీ నేతలు ఎవరైనా ఆయనను కలవడం, తమ అభిప్రాయాలు పంచుకోవడం సహజ ప్రక్రియేనని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరుపై నేతలు సలహాలు ఇస్తుంటారని తెలిపారు. ఇక, హైడ్రా అంశంపై వస్తున్న విమర్శలకు కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. తాను "హైడ్రా" అనే పదం చరిత్రలో హిట్లర్ కాలం నుంచి ప్రస్తావనలోకి వచ్చిందని మాత్రమే చెప్పానని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరూ హిట్లర్‌ను సమర్థించరని స్పష్టం చేశారు.
ప్రధాని మోడీతో సమావేశం.. తెలంగాణ ప్రాజెక్టులపై వినతి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇటీవల జరిగిన సమావేశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమేనని, అయితే ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కేంద్రం-రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న అనుమతులు, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రికి వివరించినట్లు చెప్పారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ (RRR), మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు, హైదరాబాద్-మచిలీపట్నం కనెక్టివిటీ వంటి కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
తెలంగాణ - మహారాష్ట్ర మధ్య ఉన్న కొన్ని పెండింగ్ సమస్యలను కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎం తెలిపారు. తెలంగాణలోని కొన్ని కీలక ప్రాజెక్టుల అమలుకు మహారాష్ట్ర పరిధిలోని సుమారు 1,500 ఎకరాల డ్రైల్యాండ్ అవసరమని, ఈ అంశంపై కేంద్రం సహకారం కోరినట్లు చెప్పారు. జులై నెలలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశం జరగనున్నట్లు వెల్లడించిన రేవంత్ రెడ్డి, ఆ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి లక్ష్యంగా కేంద్రంతో సమన్వయం కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.