
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Ambani Family Temple Tour: అపర కుబేడరుడు.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక యాత్ర చేపట్టింది. ప్రముఖ క్షేత్రాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఏపీలోని తిరుమల ఆలయంతోపాటు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. ఆయా ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని.. మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పారిశ్రామికవేత్త కుటుంబానికి తిరుమల క్షేత్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్ మరియు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, శ్రీకాళహస్తి పర్యటన కోసం గురువారం రాత్రి అంబానీ కుటుంబం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రి తిరుమల కొండపైకి చేరుకున్న వారు శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. మొదట తిరుమల వేంకటేశ్వర స్వామిని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. ఆయనతోపాటు కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంబానీ కుటుంబసభ్యులు అభిషేక సేవలో పాల్గొని స్వామి సేవలో తరించారు.
ఘన స్వాగతం దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు అంబానీ కుటుంబానికి వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ అధికారులు వారికి పట్టువస్త్రంతో సత్కరించి.. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంబానీ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం ఏర్పడింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీకాళహస్తిలో పూజలు దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి శుక్రవారం ఉదయం రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వచ్చారు. ఆలయానికి వచ్చిన అనంత్ అంబానీ బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు. అనంతరం కాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసునాంబ అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. గురుదక్షిణామూర్తి దగ్గర ఆలయ వేద పండితులు ఆశీర్వాదం చేయగా.. ఈవో, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలతోపాటు చిత్రపటాన్ని అందజేశారు.
పులి సంచారం తిరుపతిలో చిరుత పులి సంచారం మరోసారి స్థానికులు, విద్యార్థులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే ఐకానిక్ శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చిరుతపులి ప్రవేశించింది. క్యాంపస్‌లోని భవనాల మధ్య చిరుత కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుపతి నగరంలో చిరుత పులుల సంచారం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుత ప్రత్యక్షమవడంతో విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు. యూనివర్సిటీలోని ప్రముఖ చొప్పల రత్నం బిల్డింగ్ ఐ, జీ బ్లాక్ మధ్య చిరుతపులి సంచరిస్తుండటాన్ని గమనించిన విద్యార్థులు, స్థానికులు భయపడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన విద్యార్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆ చిరుతపులి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. చిరుత ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి క్యాంపస్ పరిసరాల్లో నిఘా పెంచాలని, విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తిరుమల కిటకిట వేసవి సెలవుల ప్రభావం తిరుమల ఆలయంలో కొనసాగుతోంది. తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటలు సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి నారాయణగిరి, ఔటర్ రింగ్ రోడ్డు, శిలాతోరణం, ఆక్టోపస్ బిల్డింగ్, గోగర్భం డ్యాం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు.