
Smartphone price | ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ ధరలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు నథింగ్ కంపెనీ సీఈఓ కార్ల్ పై. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు
. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం నుంచి మెమొరీ చిప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరగడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. అందువల్ల రాబోయే పండుగల సీజన్లో స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గుతాయని ఆశ పడొద్దని వినియోగదారులకు సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన పోస్టులు పెట్టారు.
గతంలో కంటే మెమొరీ చిప్‌ల ధరలు ఏకంగా 300 శాతం వరకు పెరిగాయని కార్ల్ పై పేర్కొన్నారు. ఒక స్మార్ట్‌ఫోన్ తయారీలో ప్రాసెసర్, డిస్ప్లే కంటే మెమొరీ అత్యంత ఖరీదైన భాగంగా మారిందని తెలిపారు. కొన్ని ప్రీమియం ఫోన్లలో మొత్తం హార్డ్‌వేర్ ఖర్చులో మెమొరీ వాటానే 50 శాతానికి పైగా ఉంటోందన్నారు. రాబోయే పండగ సీజన్ లేదా సేల్స్ సమయంలో స్మార్ట్ఫోన్లపై గతంలో మాదిరిగా భారీ డిస్కౌంట్లు లభించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఫోన్ కొనాలనుకునే వారు ఆలస్యం చేస్తే మరింత ఎక్కువ ధర చెల్లించాల్సి రావొచ్చని పేర్కొన్నారు.
మెమొరీ ఖర్చుల పెరుగుదల వల్ల మొబైల్ బ్రాండ్లు తమ లాభాలను కాపాడుకోవడానికి ఫోన్ ధరలను 30 శాతం వరకు పెంచడం లేదా ఫోన్ స్పెసిఫికేషన్లను తగ్గించడం వంటి రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుందని కార్ల్ పై అభిప్రాయపడ్డారు. నథింగ్ కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదన్నారు. తమ నథింగ్ 4ఏ అభివృద్ధి దశకు, విడుదల సమయానికి మెమొరీ ఖర్చులు రెట్టింపయ్యాయన్నారు. తమ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయడమా?మరికొంతకాలం కొనుగోలును వాయిదా వేయడమా? అనేది వినియోగదారుల ముందున్న మార్గాలని పేర్కొన్నారు. కార్ల్‌పై ఇప్పుడే కాదు.. గతంలోనూ స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగబోతున్నాయని సంకేతాలివ్వగా అది మార్కెట్లో ప్రతిఫలించింది. ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే వచ్చే ఏడాది సైతం ఇదే ధోరణి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.