
గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా
అనుభవం ఉంది.
Telangana Cabinet Expansion: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ముహూర్తం రంగం సిద్దమైంది. రేవంత్ సర్కార్ రెండున్నరేళ్ల పాలన పూర్తి కావడంతో కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు పని తీరు ఆధారంగా కొందరు మంత్రులకు ప్రమోషన్.. మరికొందరికి డిమోషన్ ఖాయమని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మంత్రివర్గంలో చోటు కోసం పలువురు ఆశావాహులు ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు. అధిష్ఠానం ఆశీస్సులు కోరుకుంటూ.. తమ మనసులోని మాటను వారికి విన్నవించారు. ఇందులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి లాంటి నేతలు ఉన్నారు. వీరిలో రాజ్ గోపాల్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రి పదవులు ఖాయమయ్యాయని హాస్తిన వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పుడు రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైందనే ప్రచారం నల్గొండ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోందట. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి శిబిరంలో కాకరేపుతోందట. ఎందుకంటే రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే.. వెంకట్ రెడ్డిని పదవినుంచి తప్పిస్తారనే సంకేతాలు పార్టీ హైకమాండ్ పంపిందట. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఆ ఇద్దరూ కూడా రెడ్డి సామాజికవర్గం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు రాజ్ గోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే.. జిల్లాలో ముగ్గురు రెడ్డి సామాజికవర్గమే అవుతారు. దాంతో ఇతర సామాజికవర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి నుంచి వెంకట్ రెడ్డిని తప్పించి.. ఆయన స్థానంలో రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు అభ్యంతరం లేదని హైకమాండ్ చెప్పడంతో.. మంత్రి వెంకట్ రెడ్డి అలర్ట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మంత్రి పదవి తమ్ముడి చేతుల్లోకి జారిపోకుండా బిగ్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకట్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డితో సఖ్యతతో లేకున్నా.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఒకప్పుడు తాను సీఎం పదవికి అర్హుడిని అంటూ ప్రకటనలు చేసిన వెంకట్ రెడ్డి.. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మరో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారనే ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు తనకు తమ్ముడి నుంచి మంత్రి పదవికి ఎసరు వస్తుందనే ప్రచారం నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి ద్వారా మంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 17న నల్గొండలో భారీ బహిరంగ సభకు మంత్రి వెంకట్ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రితో సభ ద్వారా.. తాను సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌లో సభ్యుడినే అన్న సంకేతాలను పార్టీ హైకమాండ్‌కు పంపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. నల్గొండలో ఒకట్రెండు సార్లు మాత్రమే పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా పిలుస్తుండటం ఆసక్తి రేపుతోంది. అయితే మంత్రివర్గ విస్తరణ ఖాయం కావడంతో అలర్ట్ అయిన వెంకట్ రెడ్డి.. తన పదవిని కాపాడుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని నల్గొండ కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.. మొత్తంమీద సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనపై ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి వర్గం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతారు.. మంత్రి వెంకట్ రెడ్డికి పదవి హామీ ఇస్తారా అనే ఆసక్తి వారిలో ఉందట. మరోవైపు ముఖ్యమంత్రి పదవి చేపట్టాక.. అన్ని నియోజకవర్గాలు చూట్టేసిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు మునుగోడు గడ్డపై అడుగుపెట్టలేదు. అటు మంత్రులు సైతం మునుగోడుకు వెళ్లాలంటేనే ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో రాజ్ గోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కుతుందా..! వెంకట్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పిస్తారా అనేది తెలియాలంటే మాత్రం ఈనెల 16వ తేదీ వరకు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.