
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారతీయ అభిమానులకు ఒక రోజు ముందుగానే థియేటర్లలో సందడి చేయనుంది. మొదట ప్రకటించిన తేదీ కంటే ఒక
రోజు ముందుగా, ఈ చిత్రం జూలై 30, 2026న భారతదేశంలో విడుదల కానుంది. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అలాగే, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జూన్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. విడుదలైన ట్రైలర్ ఇప్పటికే చరిత్ర సృష్టిస్తూ 1 బిలియన్ వ్యూస్‌ను దాటిన తొలి సినిమా ట్రైలర్‌గా రికార్డు నమోదు చేయడం విశేషం.
దాదాపు ఐదేళ్ల తర్వాత టామ్ హాలండ్ మరోసారి స్పైడర్-మ్యాన్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ సంఘటనల తర్వాత నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో, తనకు అత్యంత ప్రియమైన వారందరి జ్ఞాపకాల నుంచి తాను స్వచ్ఛందంగా మాయమైన పీటర్ పార్కర్ జీవితాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. న్యూయార్క్ నగరాన్ని కాపాడేందుకు పూర్తిగా స్పైడర్-మ్యాన్‌గా మారిన అతడు ఎదుర్కొనే సరికొత్త సవాళ్లు, శక్తివంతమైన శత్రువులతో పోరాటం కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హాలండ్‌తో పాటు జెండయా, జేకబ్ బటలాన్, జాన్ బెర్న్థల్, సాడీ సింక్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 2డీ, 3డీ మరియు అన్ని ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది.