
– ‘స్మృతి’ వేడుకలో 30 కుటుంబాల రాకతో వెల్లివిరిసిన ఆనందం బూర్గంపహాడ్, జూన్ 12 : ఒక తరం కష్టపడి సంపాదిస్తే మరో తరం కాపాడుతుంది.. ఒక తరం పెంచుతుంది.. ఒక తరం ముందుకు తీసుకుపోతుంది. ఈ బంధం తెగకుండా
చూసుకునే బాధ్యత తరతరాల కుటుంబానిది. నాలుగు తరాలు ఒకేచోట కలిస్తే ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. అదే బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్కు చెందిన మార్తి తిరుపతయ్య- రామలక్ష్మి కుటుంబ దృశ్యం. శుక్రవారం పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ఓ ఫంక్షన్హాల్లో ఆవిష్కృతమైంది. మార్తి తిరపతయ్య- రామలక్ష్మి దంపతులు. కాలం చేసి 30 ఏళ్లు గడిచిపోవడం.. ఆ తర్వాత కుమారులు వెంకటేశ్వర్లు, మార్తి నాగయ్య కూడా చనిపోవడం.. వెంకటేశ్వర్లు 16వ వర్ధంతిని పురస్కరించుకుని మార్తి తిరుపతయ్య- రామలక్ష్మి దంపతుల జ్ఞాపకార్ధ సమ్మేళనంగా భావించి నాలుగు తరాలకు చెందిన కుటుంబంలో కుమారులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు ఇలా మొత్తం 150 మంది స్మృతి సమ్మేళనం నిర్వహించారు.
మార్తి నాగరాజు, నాగేంద్ర ప్రసాద్, జాని, కిస్మత్ రావు, గోతం ముతేశ్, ఎనుముల వెంకటేశ్ తరతరాల కుటుంబ సభ్యులను ఒక వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు నిర్వహణ బాధ్యతను తలకెత్తుకుని 30 కుటుంబాల వారంతా ఒక గొడుకు కిందకు వచ్చేలా కష్టపడ్డారు. వర్ధంతి సందర్భంగా అందరూ హాజరనైప్పటికీ నాలుగు తరాలు ఒకేచోట కలిసి చిన్ననాటి స్మృతులు, ముచ్చట్లు చెప్పుకోవడం ఆనందాన్ని కలిగించిందని వారంతా ఉద్వేగంతో పొంగిపోయారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో ఆనందంగా గడిపి సహఫంక్తి భోజనం చేయడంతో ఈ వేడుక ముగిసింది. మానవ సంబంధాలు నెలబెట్టి, కొత్త జీవన స్ఫూర్తిని నింపేలా నిర్వహించిన ఈ స్మృతి వేడుక చూపరులందరినీ ఆకట్టుకుంది.